ఎలిమినేడులో ఏరోస్పేస్‌ పార్కు

23 Mar, 2021 03:23 IST|Sakshi

ప్రారంభమైన భూసేకరణ పనులు 

జలమండలి పరిధిలో 20 కేఎల్‌ నీటి వినియోగం వరకు ఉచితం 

హైదరాబాద్‌ పరిధిలో  9.85 లక్షల కుటుంబాలకు లబ్ధి

నల్లా కనెక్షన్‌కు ఆధార్‌తో అనుసంధానం ఏప్రిల్‌ 30 వరకు..

మండలిలో మంత్రి కేటీఆర్‌ వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు సమీపంలో ఏరోస్పేస్‌ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. ఇందుకు సంబంధించి భూసేకరణ పనులు వేగవంతం చేశామని, త్వరలోనే ఈ పార్కు ఏర్పాటుకు సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఇక్కడున్న 7 ఏరోస్పేస్‌ పార్కులకు ఇది అదనమని పేర్కొన్నారు. శాసనమండలి సమావేశాల్లో భాగంగా సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు ప్రభాకర్‌రావు, ఫారుక్‌హుస్సేన్‌ లేవనెత్తిన అంశాలపై మంత్రి మాట్లాడారు. ‘హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్‌ ఏరోస్పేస్‌ హబ్‌గా మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం.  ఆదిభట్లలో ఉన్న ఏరోస్పేస్‌ సెజ్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి.

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టులో ప్రత్యేకంగా ఏరోస్పేస్‌ పార్కుకు భూమిని నోటిఫై చేశాం. నాదర్‌గుల్‌లో కూడా ఏరోస్పేస్‌ పార్కుకు భూములు కేటాయించాం. ఇబ్రహీంపట్నానికి 3 కిలోమీటర్ల దూరంలో 100 ఎకరాల్లో కాంపొజిట్‌ పార్కు ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో ఇప్పటికే 40 సంస్థలకు భూములు కూడా కేటాయించాం. హైదరాబాద్, సమీప ప్రాంతాల్లో పెట్టుబడులకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. బెంగళూరు–హైదరాబాద్‌ మధ్య రక్షణ పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాం. దీంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని వెనుకబడ్డ ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయని కేంద్రానికి సూచిస్తే పట్టించుకోకుండా బుందేల్‌ఖండ్‌కు మంజూరు చేసింది’అని వివరించారు.  

మీటరు బిగించుకునే గడువు పెంపు.. 
‘జలమండలి పరిధిలో 20 వేల కిలోలీటర్ల వరకు ఉచితంగా తాగునీరు అందిస్తున్నాం. ఇందుకు ప్రతి ఒక్కరు నల్లాకు మీటరు బిగించుకోవాలి.  9.85 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. మార్చి నెలాఖరు వరకు మీటరు బిగించుకునే గడువు ఉంది. క్షేత్రస్థాయిలో ప్రజల కోరిక మేరకు మరో నెలగడువు పెంచుతున్నాం. నల్లాకు ఆధార్‌ అనుసంధానం కూడా ఏప్రిల్‌ 30 వరకు పొడిగిస్తున్నాం. ఉచిత తాగునీటి పథకంతో జలమండలిపై ఏటా రూ.480 కోట్ల భారం పడుతుంది. ప్రజలకు రక్షిత మంచినీటిని ఉచితంగా అందించాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించడంతో ప్రభుత్వమే ఈ భారాన్ని మోస్తోంది. ప్రస్తుతం జలమండలి పరిధిలో అమలు చేస్తున్న ఉచిత తాగునీటి పథకాన్ని ఇతర మున్సిపాలిటీల్లో అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తాం’అని కేటీఆర్‌ వివరించారు.   

మరిన్ని వార్తలు