అండగా ఉంటాం.. పెట్టుబడులతో రండి

29 Nov, 2022 02:03 IST|Sakshi
సదస్సులో వర్చువల్‌గా పాల్గొని మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌ 

ఏరోస్పేస్, రక్షణ కంపెనీల ప్రతినిధులను కోరిన  కేటీఆర్‌ 

దేశంలో రక్షణ రంగంలో అనుకూల పరిస్థితులున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి 

ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మరింత విస్తరించింది 

హైదరాబాద్‌కు ‘మిస్సైల్‌ హబ్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరున్నట్లు వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో రక్షణరంగ కంపెనీలకు అనుకూల పరిస్థితులు కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. గత ఏడేళ్లలో ఈ వ్యవస్థ బాగా విస్తరించిందన్నారు. ఆదిభట్ల, నాదర్‌గుల్, జీఎంఆర్‌ ఏరోస్పేస్, హార్డ్‌వేర్‌ పార్క్, ఈ–సిటీ, ఇబ్రహీంపట్నం వంటి ప్రత్యేక ఏరోస్పేస్, డిఫెన్స్‌ రంగ పారిశ్రామికవాడలు తెలంగాణలో ఉన్నాయని, పెట్టుబడులతో రావాలని విజ్ఞప్తి చేశారు.

అన్ని విధాలుగా సహకారం అందించి, అండగా ఉంటామని డిఫెన్స్‌ కంపెనీల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ డిఫెన్స్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ (ఎస్‌ఐడీఎం) ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలో జరిగిన రక్షణరంగ కంపెనీల ప్రతినిధుల సమావేశంలో కేటీఆర్‌ హైదరాబాద్‌ నుంచి వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు. డిఫెన్స్, ఏరోస్పేస్‌ రంగాల్లో స్థానికంగా వెయ్యికిపైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలున్నాయని తెలిపారు.

రాష్ట్రంలోని రక్షణరంగ పరిశోధన, అభివృద్ధి రంగం అత్యంత కీలకమైనదని, హైదరాబాద్‌ నగరానికి ‘మిస్సైల్‌ హబ్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరు ఉందన్నారు. డీఆర్డీఓ, భెల్, హెచ్‌ఏఎల్‌ వంటి అనేక రక్షణరంగ సంస్థలు ఇక్కడ ఉన్నాయన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ దిగ్గజ ఏరోస్పేస్, డిఫెన్స్‌ సంస్థలు ఇక్కడ భారీ పెట్టుబడులు పెట్టినట్లు గుర్తుచేశారు.

అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇజ్రాయెల్‌ తదితర దేశాలకు చెందిన ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మ్యానుఫ్యాక్చరర్‌ (ఓఈఎం) కంపెనీలు ఒకేచోట ఇంత భారీగా పెట్టుబడులు పెట్టిన నగరం మరొకటి లేదని తేల్చిచెప్పారు. లాక్‌ హీడ్‌ మార్టిన్, బోయింగ్, జీఈ, సాఫ్రాన్‌ వంటి అనేక కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  

రక్షణ రంగమే ప్రాధాన్యత
ఏరోస్పేస్, డిఫెన్స్‌ను ప్రాధాన్యత రంగంగా గుర్తించి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సంస్కరణలను తెచ్చామని కేటీఆర్‌ తెలిపారు. టీఎస్‌–బీపాస్, ప్రపంచస్థాయి మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, 24 గంటల విద్యుత్‌ సరఫరా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తమ పెట్టుబడి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని కోరారు. ‘టాస్క్‌’ద్వారా ప్రైవేట్‌ సంస్థలకు అవసరమైన మానవ వనరుల శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. క్రాన్‌ఫీల్డ్‌ యూనివర్సిటీ వంటి సంస్థలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు చెప్పారు. టీ–హబ్, వీ–హబ్, టీ–వర్క్స్‌లతో నగరంలో పరిశోధనలు, ఆవిష్కరణలకు ఊతమొచ్చిందన్నారు.  

>
మరిన్ని వార్తలు