వరంగల్‌లో వరద బాధితులను పరామర్శించిన కేటీఆర్‌

18 Aug, 2020 16:34 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: మంత్రి కేటీఆర్‌ మంగళవారం నగరంలో వరదలకు గురయిన ప్రాంతాలలో  పర్యటించారు. మొదట హన్మకొండకు చేరుకున్న కేటీఆర్‌ నయిం నగర్ నాలను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఈటెల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతులతో కలసి పరిశీలించారు. తదుపరి సమ్మయ్య నగర్ ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి కేటీఆర్ బాధితులలో ధైర్యాన్ని నింపారు.  నాలా సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తామని భరోసానిచ్చారు.  డ్రైనేజీ నిర్మాణానికి రూ. 10కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంట్లో నీళ్లు నిలిచిపోయిన బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అక్రమాలకు గురైన నాలను తొలగిస్తామని, ఆ సమయంలో  ప్రజలు సహకరించాలని కేటీఆర్‌ కోరారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులలో ప్రాణ నష్టం జరగకపోవడం సంతోషించదగ్గ విషయమన్నారు. 

మంత్రి దయాకర్‌రావు, చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ బస్సు నుంచే  ఇదులవాగులోని నీటి ప్రవాహాన్ని కేటీఆర్‌కు వివరించారు. అనంతరం 100 ఫీట్స్ పెద్దమ్మ గడ్డ ఆర్‌ ఆర్ ఫంక్షన్ హాలు వద్ద ఉన్న భద్రకాళి వాగు బ్రిడ్జి ప్రాంతంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలతో పాటు చెట్లను కూడ తొలగించాలని కేటీఆర్‌ ఆదేశించారు. ఇలాంటివి యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అవసరమైన ఏర్పాట్ల కోసం ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఆదేశాలు తీసుకోవాలని సూచించారు. నగరంలో పర్యటించి మొత్తం ముళ్ళ పొదలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మునిసిపాలిటీ శాఖ డైరెక్టర్‌కు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.  ఎమ్‌జీఎమ్‌ కోవిడ్ వార్డులోకి వెళ్లి కేటీఆర్‌ కరోనా బాధితులను పరామర్మించారు. అదనంగా 150 పడకల ను ఏర్పాటు చేస్తామని మంత్రి హామీనిచ్చారు.  అవసరమైన ఆక్సిజన్ వెంటి లెటర్‌లను ఏర్పాటు చేస్తామన్నారు.  ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రిగా కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని త్వరలో ప్రారంభిస్తామని  మంత్రి కేటీఆర్ వెల్లడించారు. 

చదవండి: ఇంకా వరద బురదలోనే వరంగల్లు

మరిన్ని వార్తలు