కొత్త ఆవిష్కరణలు చేసేలా ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి: మంత్రి కేటీఆర్‌

27 Sep, 2022 03:20 IST|Sakshi

త్వరలోనే బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు

1,000 కంప్యూటర్లతో డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేస్తాం

విద్యార్థుల ఉద్యమ స్ఫూర్తి నాకు బాగా నచ్చింది

సమస్యలన్నీ పరిష్కరిస్తా.. మళ్లీ నవంబర్‌లో వస్తానన్న మంత్రి

భైంసా (ముధోల్‌): బాసర ట్రిపుల్‌ ఐటీలో సమస్య లన్నింటినీ పరిష్కరిస్తామని.. విద్యార్థులు ఆవిష్కర ణలపై దృష్టిపెట్టేలా టీ–హబ్‌ను ఏర్పాటు చేస్తా మని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు హామీ ఇచ్చారు. ‘తక్కువ జనాభా ఉన్న అమెరికా ఉత్పత్తులు చేస్తుంటే ఎక్కువ జనం ఉన్న మనం ఇంకా ఉద్యోగాలు చేయాలన్న ఆలోచనలోనే ఉంటు న్నాం. విద్యార్థులు ఆవిష్కరణల కోసం ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. త్వరలోనే 1,000 కంప్యూటర్లతో డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేస్తాం’ అని చెప్పారు.

సోమవారం నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీని మంత్రులు సబితాఇంద్రారెడ్డి, ఇంద్ర కరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లతో కేటీఆర్‌ సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనాలు చేశారు. అనంతరం మాట్లాడారు. హైదరాబాద్‌లోని టీ–హబ్‌ను ఎంతమంది చూశారని కేటీఆర్‌ విద్యా ర్థులను ప్రశ్నించారు. అలా బాసర ట్రిపుల్‌ఐటీలోనే టీ–హబ్‌ ఏర్పాటు చేసుకుందామన్నారు.

ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి
బాసర ట్రిపుల్‌ ఐటీలో చదువుతున్న విద్యార్థులు భవిష్యత్తులో మామూలుగా ఉద్యోగాలు చేయడం కాకుండా ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలని కేటీఆర్‌ ఆకాంక్షించారు. ఉద్యోగాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకోకుండా.. కొత్త ఆవిష్కరణలు, పరిశ్రమల ఏర్పాటు ఆలోచనలు చేయాలని సూచించారు. అలాంటి ఆలోచనలున్న విద్యార్థులకు ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని తెలిపారు.

హాస్టల్‌ కష్టాలు నాకూ తెలుసు
తాను చదువుకున్నప్పుడు 70శాతం జీవితం హాస్టల్‌లోనే గడిచిందని, హాస్టల్‌ కష్టాలు తనకూ తెలుసని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ట్రిపుల్‌ ఐటీలో సమస్యలన్నింటినీ పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రూ.3 కోట్లతో ఔట్‌డోర్‌ మినీ స్టేడియాన్ని 6 నుంచి 8 నెలల్లో పూర్తి చేస్తామని.. 50 అదనపు మోడల్‌ తరగతి గదులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నవంబర్‌లో విద్యార్థులందరికీ ల్యాప్‌టాప్‌లు ఇస్తామన్నారు.

ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ, డైరెక్టర్‌ సతీశ్‌కుమార్‌ ఇక్కడి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కొంత సమయం పడుతుందని విద్యార్థులకు సూచించారు. ట్రిపుల్‌ ఐటీ న్యూమెస్‌లో తాను వెళ్లిన బాత్రూం తలుపులు సరిగా పడలేదని.. ఇలాంటి ఇబ్బందులన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. రెండు నెలల తర్వాత విద్యా మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి మళ్లీ వస్తానన్నారు.

క్యాంపస్‌ను కాపాడుకోవాలి
10 వేల మంది ఉండే ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ప్రభుత్వం కొత్త భవనాలను నిర్మించడం, ప్రారంభించడం సులువైన పని అని.. కానీ వాటి నిర్వహణే ప్రధాన సమస్య అని, వీటిని పద్దతిగా ఉంచే క్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. పరిశుభ్రతకు జపాన్, సింగపూర్‌లలో ఇచ్చే ప్రాధాన్యతపై తన అనుభవాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు నెలలో ఒకరోజైనా శ్రమదానం చేసి.. 272 ఎకరాల్లో ఉన్న క్యాంపస్‌ పరిసరాలను శుభ్రంగా, చెత్తా చెదారం లేకుండా చేసుకోవాలని సూచించారు.

విద్యార్థుల ఉద్యమ స్ఫూర్తి నచ్చింది
ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులంతా శాంతియుతంగా చేసిన ఉద్యమ స్ఫూర్తి తనకు బాగా నచ్చిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. గాంధీజీ సత్యాగ్రహం తరహాలో.. తమ సమస్యల పరిష్కారం కోసం ఎండావానలకు వెరవక వారం పాటు విద్యార్థులు చేసిన పోరాటం బాగుందని కొనియాడారు. తాను విద్యార్థుల ఆందోళనను ప్రతిరోజు చూశానని.. ప్రతిపక్షాలు, రాజకీయ నాయకులను పిలవకుండా విద్యార్థులే ఎస్‌జీసీ ఏర్పాటు చేసుకుని, ఉద్యమించడం నచ్చిందని అభినందించారు.  

మరిన్ని వార్తలు