Minister Malla Reddy: అర్ధరాత్రి ఐటీ అధికారుల ల్యాప్‌టాప్‌పై హైడ్రామా.. అసలేం జరిగింది?

24 Nov, 2022 09:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, బంధువులు, భాగస్వాముల ఇళ్లలో, విద్యా సంస్థల్లో ఐటీ అధికారుల దాడులు ముగిశాయి. భారీగా నగదుతో పాటు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతకు సంబంధించిన కీలక సమాచారం లభించినట్లు తెలిసింది. 

కాగా, అర్ధరాత్రి ఐటీ అధికారుల ల్యాప్ టాప్‌పై హైడ్రామా చోటుచేసుకుంది. మొదట ఆసుపత్రిలో ఐటీ అధికారి రత్నాకర్‌ ల్యాప్‌టాప్‌ వదిలివెళ్లారు. రత్నాకర్‌ను బోయిన్‌పల్లి పీఎస్‌కు మంత్రి మల్లా రెడ్డి  తీసుకొచ్చారు. ఆసుపత్రిలో ఉండిపోయిన ల్యాప్‌టాప్‌ను మల్లా రెడ్డి అనుచరులు పీఎస్‌కు తీసుకుని వచ్చారు. అప్పటికే పోలీస్ స్టేషన్‌ను  కేంద్ర బలగాలు తమ ఆధీనంలో ఉంచుకున్నాయి. ల్యాప్‌టాప్‌ను లోపలికి తీసుకెళ్లేందుకు మల్లారెడ్డి అనుచరులు ప్రయత్నించారు.

బోయినపల్లికి చెందిన కానిస్టేబుల్.. ల్యాప్‌టాప్‌ను లోపలికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానిస్టేబుల్‌ను అడ్డుకున్న కేంద్ర బలగాలు.. ల్యాప్‌టాప్‌ను బయటే పెట్టించాయి. బోయినపల్లి పీఎస్ గేటు ముందే ల్యాప్‌టాప్‌ను మంత్రి అనుచరులు వదిలి వెళ్లారు. మల్లారెడ్డిపై ఐటీ అధికారులు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీస్ స్టేషన్‌ను  కేంద్ర బలగాలు ఖాళీ చేశాయి. కేంద్ర బలగాలు వెళ్లిన తర్వాత ల్యాప్‌టాప్‌ను బోయినపల్లి పీఎస్ లోపలికి పోలీసులు తీసుకెళ్లారు. ప్రస్తుతం బోయినపల్లి పీఎస్లోనే ల్యాప్‌టాప్ ఉంది.
చదవండి: మంత్రి మల్లారెడ్డికి ఐటీ నోటీసులు.. సోదాల్లో ఎంత నగదు దొరికిందంటే? 

మరిన్ని వార్తలు