Mekapati Goutham Reddy Demise: మహబూబాబాద్‌ జిల్లాలో విషాదఛాయలు

22 Feb, 2022 07:42 IST|Sakshi
పుట్టిన రోజున ఐటీ మంత్రి గౌతమ్‌రెడ్డితో స్నేహితుడు గౌతమ్‌రెడ్డి (ఫైల్‌)

ఏపీ పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఆయన అత్తగారు ఊరు అయిన మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండల కేంద్రంలో సోమవారం విషాదఛాయలు అలుముకున్నాయి. గౌతమ్‌రెడ్డికి గూడూరుతోపాటు దంతాలపల్లి, ఆగపేటలో చాలామంది స్నేహితులు ఉన్నారు. తరచూ ఇక్కడికి వచ్చి వెళ్తుండేవారు. ఆయన మరణవార్తను మొదట నమ్మలేదని, మంచి వ్యక్తిని కోల్పోయామని ఆగపేటకు చెందిన నూకల గౌతమ్‌రెడ్డి కన్నీరుమున్నీరుగా విలపించారు. 

సాక్షి, మహబూబాబాద్‌ (గూడూరు/నర్సింహులపేట): ఏపీ పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో మహబూబాబాద్‌ జిల్లా గూడూరు, డోర్నకల్‌ నియోజవర్గంలోని నర్సింహులపేట మండలం దంతాలపల్లి, ఆగపేట గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గూడూరు మండల కేంద్రానికి చెందిన ఐఏఎస్‌ అధికారి ఈవి రాంరెడ్డి కుమారుడు అనిల్‌రెడ్డి రెండో కూతురిని మంత్రి గౌతమ్‌రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. 30 ఏళ్లుగా అనిల్‌రెడ్డి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. వారి భూములు గూడూరులో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో మేకపాటి గౌతమ్‌రెడ్డి వివాహం జరిగింది. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఆంధ్రా అల్లుడు, తెలంగాణ అమ్మాయి అంటూ స్థానికులు పిలుచుకునే వారు. గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఆయా గ్రామాల్లోని బంధువర్గం, మిత్ర బృందంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

బంగారంలాంటి స్నేహితున్ని కోల్పోయా..
మేకపాటి గౌతమ్‌రెడ్డి వ్యక్తిత్వం బంగారం. అంత మంచి స్నేహితున్ని కోల్పోయా. మాది 15ఏళ్ల స్నేహం. వాడి కోసం నెల్లూరులో రెండు సార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా. ఎన్నో సార్లు చాలా విషయాల గురించి చర్చించాం. శనివారం సాయంత్రం ఫోన్‌ కూడా చేశాడు. దుబాయ్‌ నుంచి వస్తున్నానని చెప్పాడు. ఇంతలోనే ఇలా జరగడం జీర్ణించుకోలేకపోతున్నా. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నా.
– నూకల గౌతమ్‌రెడ్డి, ఆగపేట 

మరిన్ని వార్తలు