సాగు రుణాలు రూ.లక్ష కోట్లు

28 Jan, 2022 02:28 IST|Sakshi

అందులో పంట రుణాలు రూ. 67,863 కోట్లు

మొత్తం రాష్ట్రంలో రుణాలు రూ. 1.66 లక్షల కోట్లు

2022–23 ఫోకస్‌ పేపర్‌లో నాబార్డు వెల్లడి

నివేదికను విడుదల చేసిన వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఆర్థిక సంవత్స రంలో వ్యవసాయం, అనుబంధ రంగాల న్నింటికీ కలిపి రూ. 1,01,173 కోట్ల రుణాలు ఇవ్వాలని నాబార్డు నిర్దేశించింది. ఇందులో పంట రుణాలను రూ. 67,863 కోట్లుగా పేర్కొంది. మొత్తం రాష్ట్ర రుణ ప్రణాళికను రూ. 1,66,384.90 కోట్లుగా ఖరారు చేసింది. ఈ మేరకు 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫోకస్‌ పేపర్‌ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి గురువారం విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, అర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునం దన్‌రావు, టెస్కాబ్‌ చైర్మన్‌ రవీందర్‌రావు, ఆర్‌బీఐ రీజనల్‌ డైరెక్టర్‌ నిఖిల, నాబార్డు సీజీఎం వైకే రావు, ఎస్‌ఎల్‌బీసీ చైర్మన్‌ అమిత్‌ జింగ్రాన్‌ తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కొందరు, మరికొందరు నేరుగా పాల్గొన్నారు.

ఆయిల్‌పామ్‌ సాగుకు బ్యాంకర్లు సహకరించాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రం గానికి రుణ పరపతి పెంచాలని బ్యాంకర్లను కోరారు. జనాభాలో 60 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుర్తించారని, నాబార్డు సహకారంతో మిషన్‌ కాకతీయ పథకం కింద చెరువులు, కుంటల పునరుద్ధరణతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారన్నారు.

ఈ పథకాల వల్ల తెలంగాణవ్యాప్తంగా భూగర్భ జలాలు పెరిగాయని, పంటల విస్తీర్ణం పెరగడంతోపాటు రికార్డు స్థాయిలో వరి దిగుబడి వస్తోందన్నారు. అయితే సుస్థిర వ్యవసాయం ప్రాధాన్యాన్ని గుర్తించి పంటల వైవిద్యీకరణలో భాగంగా రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తున్నామని నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ధీర్ఘకాలిక ఆయిల్‌పామ్‌ వంటి పంట సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుందన్నారు. దీనికిగాను నాబార్డు సూచనల మేరకు క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు ఆయిల్‌ పామ్‌ సాగుకు సహకరించాలన్నారు.

రైతుల ఆదాయాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, ఆహారశుద్ధి రంగాల్లో ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేస్తోందన్నారు. ప్రతి జిల్లాలో 500 ఎకరాలను గుర్తించి అందులో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఆహారశుద్ధి పరిశ్రమలు, గోడౌన్లు, మౌలిక సదుపాయాలతోపాటు పంటల ఉత్పత్తుల ఎగుమతులకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకొని యువత ఉపాధి కోసం ఇటు వైపు దృష్టిసారించాలన్నారు. దీనికి బ్యాంకర్లు ఆర్థిక సహకారం అందించాలన్నారు.

ప్రభుత్వ లక్ష్యానికి ఊతమిచ్చేలా...
రైతుల ఆదాయాన్ని పెంపొందించడానికి సమగ్ర విధానాన్ని అవలంబించాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ స్టేట్‌ ఫోకస్‌ పేపర్‌లో వ్యవసాయం, ఆయిల్‌పామ్‌ సాగు, ప్రాసెసింగ్, ఇంటిగ్రేటెడ్‌ ఫార్మింగ్‌ సిస్టమ్స్‌లో సాంకేతిక ఆవిష్కరణల వంటి అంశాలపై దృష్టిసారించినట్లు నాబార్డు తెలిపింది. రైతుల ఆదాయాన్ని పెంపొందించడానికి పాడిపరిశ్రమ, మేకల పెంపకం, పందుల పెంపకం, మత్స్య పరిశ్రమ వంటి అనుబంధ కార్యకలాపాలు అందించే సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు చేయాలని సూచించింది.

ఒక జిల్లా–ఒక పంట పథకం కింద ఉద్యాన పంటల క్లస్టర్‌ ఆధారిత ఉత్పత్తిని ప్రోత్సహించాలని నాబార్డు భావిస్తోంది. 2024–25 నాటికి తొమ్మిది జిల్లాల్లో 10,000 ఎకరాల్లో ప్రత్యేక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ చేపట్టింది. దానికి అవసరమైన ఊతం ఇవ్వాలని నాబార్డు బ్యాంకర్లకు సూచించింది. కాగా, 2021–22లో వ్యవసాయ రుణాలు రూ. 83,368 కోట్లు ఉండగా 2022–23లో అవి రూ. లక్ష కోట్లు దాటనుండటం విశేషం.

మరిన్ని వార్తలు