తెలుగు సాహిత్య శిఖరం సినారె

30 Jul, 2021 01:57 IST|Sakshi
సి.నారాయణరెడ్డి సాహితీ పురస్కారాన్ని జూకంటి జగన్నాథంకు ప్రదానం చేస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి. చిత్రంలో వరప్రసాద్‌రెడ్డి, ఎల్లూరి శివారెడ్డి, జస్టిస్‌ చలమేశ్వర్, దేశపతి శ్రీనివాస్‌ తదితరులు

సి.నారాయణరెడ్డి జయంతి ఉత్సవాల్లో మంత్రి నిరంజన్‌ రెడ్డి 

జూకంటికి సినారె సాహితీ పురస్కారం ప్రదానం

సుల్తాన్‌బజార్‌: జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలుగు సాహిత్య శిఖరమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ సారస్వత పరిషత్తు, సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన డాక్టర్‌ సి.నారాయణరెడ్డి 90వ జయంతి ఉత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  రాజ్యసభలో మామూలుగా సభ్యులెవరైనా 100 ప్రశ్నలు వేస్తే గొప్ప అని, కానీ సినారె నామినేటెడ్‌ సభ్యులుగా ఉన్న సమయంలో తమ పదవీ కాలంలో 624 ప్రశ్నలు వేశారని వెల్లడించారు.

ఈరోజు రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చినందుకు ఎక్కువగా చర్చిస్తున్నారని, కానీ సినారె 1960లోనే రామప్ప పేరుతో అద్భుతమైన రూపకం రాశారని నిరంజన్‌రెడ్డి తెలిపారు. పరిషత్తులోని డాక్టర్‌ దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్‌ సి.నారాయణరెడ్డి సినీగీత సర్వస్వం 7వ సంపుటిని మంత్రి నిరంజన్‌రెడ్డి, మొత్తం 7 పాటల వివరాలతో కూడిన అనుక్రమణికను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చలమేశ్వర్‌ ఆవిష్కరించారు. పరిషత్తులో నెలకొల్పడానికి రూపొందించిన సినారె నిలువెత్తు తైలవర్ణ చిత్రాన్ని శాంతా బయోటెక్స్‌ అధినేత డాక్టర్‌ ఐ.వరప్రసాదరెడ్డి ఆవిష్కరించి, చిత్రకారుడు జె.వి.ని సత్కరించారు. పరిషత్తు ఏటా అందజేస్తున్న సి.నారాయణరెడ్డి సాహితీ పురస్కారాన్ని ఈసారి సిరిసిల్లకు చెందిన ప్రముఖ కవి జూకంటి జగన్నాథంకు ప్రదానం చేశారు.

పురస్కారం కింద రూ.25 వేల రూపాయల నగదు, జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ, డాక్టర్‌ సినారె పరిషత్తుకు 25 సంవత్సరాలు అధ్యక్షులుగా వ్యవహరించి సర్వాంగీణ వికాసానికి కృషి చేశారన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చలమేశ్వర్‌ మాట్లాడుతూ, సినారె, తాను అశోక్‌నగర్‌లో ఉన్నప్పుడు కలిసి ఇందిరాపార్కులో నడకకు వెళ్లేవారమని, వారు రాసిన అనేక కవితలకు తొలి శ్రోతగా ఉండే అవకాశం కలిగిందన్నారు. సీఎంవో ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్‌ సినారె కవితలను, సినీగీతాలను ఆలపించారు. కోశాధికారి మంత్రి రామారావు, సినారె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు