సైకిల్‌పై పువ్వాడ: చక్కర్లు కొడుతూ.. సూచనలిస్తూ

8 Apr, 2021 13:12 IST|Sakshi

సాక్షి, ఖమ్మం‌: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌.. కలెక్టర్‌ ఆర్వీ.కర్ణన్, మున్సిపల్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంతితో కలిసి బుధవారం ఉదయం మున్సిపల్‌ కార్యాలయం నుంచి వైరా రోడ్‌ మీదుగా సైకిల్‌పై నగరంలోని ప్రధాన సెంటర్లలో పర్యటించారు. కొత్త మున్సిపల్‌ భవనం వరకు సైకిల్‌పై పర్యటించి రోడ్డుకు ఇరువైపులా చేపట్టిన సైడు డ్రెయిన్లు, రోడ్డు విస్తరణ పనులు, విద్యుత్‌ స్తంభాలు, మిషన్‌ భగీరథ అంతర్గత పైపులైన్, పారిశుద్ధ్య పనులను మంత్రి పరిశీలించారు. పలు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో జాప్యం పట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలల తరబడి పనుల కొనసాగింపు కుదరదని, పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ప్రజా రవాణాకు, ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ సహకారంతో ఖమ్మంకు ఎక్కువ మొత్తంలో నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేస్తున్నామన్నారు.

నగరాభివృద్ధిలో విద్యుత్‌ శాఖ అధికారులు అద్భుతంగా పని చేస్తున్నారన్నారు. నగరాభివృద్ధికి రూ.30కోట్ల ఎస్‌డీఎఫ్‌ నిధులను సీఎం మంజూరు చేశారని, ఆ నిధులను రోడ్ల మరమ్మతులు, డ్రెయిన్ల నిర్మాణానికి ఖర్చు చేస్తామన్నారు. బడ్జెట్‌లో ఖమ్మం కార్పొరేషన్‌కు రూ.150కోట్లు కేటాయించారని, ఆ నిధులను వినియోగించుకొని నగరంలోని మట్టి రోడ్లన్నింటినీ సీసీ రోడ్లుగా ఆధునికీకరించడంతోపాటు అన్ని ప్రాంతాల్లో డ్రెయిన్లు నిర్మిస్తామన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల ప్రజలు ఆనందంగా ఉన్నారని, మరిన్ని అభివృద్ధి పనులు చేసేలా ప్రజలు తమను ఆశీర్వదించాలన్నారు. ఇంకా మంత్రి వెంట మున్సిపల్, విద్యుత్, పబ్లిక్‌ హెల్త్, రెవెన్యూ శాఖల అధికారులు ఉన్నారు.


చదవండి: మంత్రి జగదీశ్‌ కంటతడి

మరిన్ని వార్తలు