నాపై కుట్ర పన్నారు

23 Apr, 2022 04:30 IST|Sakshi

చిన్న ఘటనను సాకుగా చూపి నిందలు మోపుతున్నారు

ఈ కుట్రలో సూడో చౌదరిలు కూడా చేతులు కలిపారు

వైరాలో కమ్మ భవనం ప్రారంభోత్సవంలో మంత్రి పువ్వాడ

వైరా: ఖమ్మంలో జరిగిన చిన్న ఘటనను ఆసరాగా చేసుకొని నిందలు మోపుతున్నారని, తనపై కుట్ర పన్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చెప్పారు. కుట్రలు, కుతంత్రాలు చేసే వారితో సూడో చౌదరిలు కూడా చేతులు కలిపారని ఆరోపించారు. ఏపీలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక్క మంత్రినీ తొలగించారని.. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఉన్న  ఏకైక కమ్మ సామాజిక మంత్రిని తానేనని పేర్కొన్నారు. ఇప్పుడు తనకు కూడా పొగ పెట్టారన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో కమ్మ జన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన కమ్మ వారి ఏసీ కల్యాణ మండపాన్ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు.

తర్వాత సభలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కమ్మ సామాజికవర్గానికి సీఎం కేసీఆర్‌ తగిన ప్రాధాన్యం ఇస్తూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలుగానే కాకుండా పార్టీ జిల్లా అధ్యక్ష పదవుల్లో నియమిస్తున్నారని చెప్పారు. అతి పిన్న వయసులో తనకు మంత్రి పదవి ఇచ్చారన్నారు. ఏ పార్టీలో కమ్మ సామాజిక వర్గానికి మేలు జరుగుతుందో ఆలోచించాలని, పార్టీలకతీతంగా కమ్మ కులస్తులందరూ ఐక్యంగా సామాజికవర్గ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం మేయర్‌ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు