నన్ను సొంత సోదరిలా ఆదరించారు: సబితా

26 Jul, 2020 10:29 IST|Sakshi

నాలో నాతో వైఎస్సార్ పుస్తకంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : ఈరోజు తాను ఇలా ఉన్నానంటే దానికి కారణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డినే అని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వైఎస్సార్‌ తనను సొంత సోదరిలా చూసుకున్నారని గుర్తుచేసుకున్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మ రాసిన ‘‘నాలో... నాతో... వైఎస్సార్‌’’ పుస్తకంపై సబితా ఇంద్రారెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం సాక్షితో ఆమె మాట్లాడారు. వైఎస్సార్ ప్రజలందరిపై చెరగని ముద్ర వేసారని అన్నారు. ఆయనతో 37ఏళ్ళ అనుబంధాన్ని విజయమ్మ పుస్తకం ద్వారా చక్కగా అభివర్ణించారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల పట్ల ఆయన మెలిగిన తీరును వైఎస్ విజయమ్మ చాలా చక్కగా పుస్తకంలో రాశారని అభినందించారు. సహాయం కోసం ఎవరు వచ్చినా నీకు నేనున్నానంటూ భరోసానిచ్చిన నేత వైఎస్సార్‌ అని చెప్పారు. (ఆత్మనివేదనలో అంతరంగం)


‘కుటుంబ సభ్యులకు ఆత్మీయత, అనురాగాలను పంచిన తీరు విజయమ్మ చాలా చక్కగా పుస్తకంలో రాసారు. ఈ పుస్తకంలో నాకంటూ ఒక పేజీ ఉందని ఎంతో సంతోషిస్తున్నా. వైఎస్సార్‌ ప్రతీ ఒక్కరినీ చిరునవ్వుతో పలకరించేవారు. కుటుంబానికి న్యాయం చేస్తూనే.. రాష్ట్రాన్ని ఎలా లీడ్ చేయవచ్చు అనే అంశాల ద్వారా వైఎస్సార్ అందరికీ ఆదర్శప్రాయులు. సొంత చెల్లిలా అన్న నన్ను ఆదరించారు. అపశకునం అని ఎంతమంది చెప్పినా వినకుండా పాదయాత్ర నా వద్దనుండే ప్రారంభించారు. రచ్చబండ కూడా నావద్ద నుండి ప్రారంభించి ఉంటే ఆయన బ్రతికేవారేమో. ఈరోజు నేనిలా ఉన్నానంటే అందుకు అన్నే కారణం. పాదయాత్రలో షర్మిల కొడుకు రాజాబాబు కలిసిన సందర్భంలో ప్రత్యక్షంగా నేను అక్కడే ఉన్నాను. ఎత్తుకుంటాం అని చెప్పినా నేను తాతతో నాడుస్తానని రాజాబాబు నడిచాడు’ అని అన్నారు. (‘నాలో.. నాతో.. వైఎస్సార్‌’కు విశేష పాఠకాదరణ)

కాగా వైఎస్సార్‌’’పుస్తకాన్ని, మహానేత 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్‌ విజయమ్మ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. వైఎస్‌ సహధర్మచారిణిగా విజయమ్మ 37 ఏళ్ల జీవితసారం ఈ పుస్తకం. 2009 సెప్టెంబరు 2న అనూహ్యంగా వైఎస్‌ మరణించిన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారం ఈ పుస్తకం.  కొడుకుగా, తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా, భర్తగా, అల్లుడిగా, మామగా, స్నేహితుడిగా, నాయకుడిగా... నిజ జీవితంలో వైఎస్సార్‌ ఈ వేర్వేరు పాత్రల్లో ఎలా ఉండే వారో, ప్రతి ఒక్కరితో ఎంత ఆత్మీయంగా మెలిగేవారో విజయమ్మ వివరించారు. 


 

మరిన్ని వార్తలు