బాసర ట్రిపుల్‌ ఐటీలో.. ఫుడ్‌ పాయిజన్‌

16 Jul, 2022 14:47 IST|Sakshi

300 మందికిపైగా విద్యార్థులకు అస్వస్థత 

ఘటనపై విచారణకు ఆదేశించిన మంత్రి సబిత

బాసర/నిజామాబాద్‌ నాగారం/సాక్షి, హైదరాబాద్‌: నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీలో శుక్రవారం కలుషిత ఆహారం కారణంగా ఫుడ్‌ పాయిజన్‌ జరిగింది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 300 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. యూనివర్సిటీలోని పీయూసీ–1, పీయూసీ–2 మెస్‌లలో మధ్యాహ్నం ఎగ్‌ఫ్రైడ్‌ రైస్‌ వడ్డించారు. దీనిని తిన్న ఈ–1, ఈ–2, పీ–2 విద్యార్థులకు కడుపునొప్పి రావడంతోపాటు వాంతులు, విరేచనాలు అయ్యాయి. పరిస్థితిని గమనించిన అధికారులు బాధిత విద్యార్థులకు క్యాంపస్‌లోని ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌లో చికిత్స అందించారు.

కాగా, పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న కొంత మందిని అంబులెన్స్‌లో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ట్రిపుల్‌ ఐటీ చేరుకుని విద్యార్థుల పరిస్థితిని పరిశీలించారు. మరో పక్క ఫుడ్‌ పాయిజన్‌ గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని తమ పిల్లల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుకున్నారు.

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రిలో 17 మంది, నవీపేటలోని ప్రైవేటు నర్సింగ్‌ హోంలో మరో 12 మంది విద్యార్థులకు చికిత్స చేస్తున్నారు. వీరిలో జిల్లాలో కేంద్రంలో చికిత్స పొందుతున్న ఆరుగురు డిశ్చార్జి అయ్యారు. కోమలి, హరిత అనే విద్యార్థినుల పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు. 

విచారణకు ఆదేశించిన విద్యాశాఖ మంత్రి 
బాసర ట్రిపుల్‌ ఐటీలో మధ్యా­హ్న భోజనం వికటించి పలు­వురు విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విచారణకు ఆదేశించారు. బా­ధ్యు­లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను మెరుగైన వైద్య సేవల కోసం నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించాలని ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. 

మంత్రి హరీశ్‌రావు ఆరా
బాసర ట్రిపుల్‌ ఐటీ ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. విద్యార్థుల ఆరో­గ్య పరిస్థితిపై ఆరా తీశారు. ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్, నిర్మల్‌ జిల్లా కలెక్టర్, వైద్యాధికారుల ద్వారా వివరా­లు తెలుసుకున్నారు. ప్రత్యేక వైద్య బృందా­లు పంపాలని, విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు.

ట్రిపుల్‌ ఐటీలో కలుషిత ఆహారం కారణంగా పలువురు విద్యార్థులు అస్వస్థ­తకు గురికావడం దిగ్భ్రాంతిని కలిగించిందని ట్విట్ట­ర్‌లో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యా­నించారు. 

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
ట్రిపుల్‌ ఐటీలో కలుషిత ఆహారానికి బాధ్యుల­నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు డిమాండ్‌ చేశారు.  

మరిన్ని వార్తలు