మంత్రి హరీశ్‌రావు భావోద్వేగం: ఈ జన్మకిది చాలు..

22 Jun, 2021 03:56 IST|Sakshi

ఆదాయం తగ్గినా ‘సంక్షేమం’ ఆగదు

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు

బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులు షురూ

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం తగ్గినా ప్రభుత్వం రైతు సంక్షేమ పథకాలను ఎలాంటి ఆటంకం లేకుండా అమలు చేస్తోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతుబంధు వానాకాలం సీజన్‌కు సంబంధించి రూ.7,500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు రూ.6,012 కోట్లను 57.67 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. సంగారెడ్డి జిల్లాలో 1.65 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో నిర్మించతలపెట్టిన బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మనూరు మండలం బోరంచ గ్రామం వద్ద ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణం పనులు త్వరగా పూర్తయ్యేలా బోరంచ నల్లపోచమ్మ దీవించాలని అంటూ, నిర్మాణం పూర్తయితే అమ్మవారికి ముక్కుపుడక చేయిస్తానని మొక్కుకున్నారు.

ఈ జన్మకిది చాలు..
బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనుల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావుకు ఓ మహిళ తారసపడింది. ఆమెను గుర్తుపట్టిన మంత్రి.. ‘చిమ్నీబాయి కైసే హో’ అని ఆప్యాయంగా పలకరించారు. ఆమె కూడా ‘కాలుబాబా తల్లి ఆశీర్వాదంతో మీరు చల్లగా ఉండాలి’ అని బదులిచ్చారు. కాగా, కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి మధ్యలో ఆమె ప్రస్తావన తెచ్చారు. ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగిందని తెలియగానే కంగ్టి మండలానికి చెందిన చిమ్నీబాయి ఫోన్‌చేసి తన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ జన్మకు ఇది చాలనుకున్నానని వ్యాఖ్యానించారు.   

మరిన్ని వార్తలు