ఏడేళ్లుగా ఈటలకు ఆత్మగౌరవం లేదా..?

23 Jul, 2021 07:46 IST|Sakshi

సాక్షి, హుజూరాబాద్‌(కరీంనగర్‌): ఆత్మగౌరవం అంటూ పదే పదే మాట్లాడుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఏడేళ్లుగా ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా? అని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాద్‌ ప్రశ్నించారు. గురువారం మండలంలోని సింగాపూర్‌లో రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐదేళ్ల నుంచే సీఎం కేసీఆర్‌తో విబేధాలు ఉన్నాయన్న ఈటల ఇన్నేళ్లు మంత్రిగా, పార్టీలో ఎందుకు ఉన్నారన్నారు.

గొర్రెల పంపిణీ, దళితబంధు పథకాలు ఒక్క హుజూరాబాద్‌కు సంబందించినవి కాదని, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న పథకాలని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ దానిని హుజూరాబాద్‌తో లింకు పెట్టడం సరికాదన్నారు. భూస్వాములకు రైతుబంధు వద్దన్న ఈటల తన ఖాతాలో జమైన డబ్బులను ప్రభుత్వానికి తిరిగి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గొర్రెల యూనిట్‌ ధరను హుజూరాబాద్‌ ఎన్నికల కోసం పెంచలేదని, ప్రస్తుతం పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  

తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని మంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన ఈటలకు ఇప్పుడు తప్పులు కనిపిస్తున్నాయా? అని ఎద్దేవా చేశారు.  ఈటల రాజేందర్‌ గెలిస్తే బీజేపీలో రెండు పోయి ముగ్గురు ఎమ్మెల్యేలు అవుతారే తప్పా, ప్రజలకు ఏం మేలు జరుగదన్నారు. పదవి పోగానే గౌరవం మర్చిపోయి మాట్లాడుతున్నారని, ఏడేళ్లు మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే సీఎం నీకు అడ్డు వచ్చాడా? అని, ఇప్పుడు పాదయాత్ర ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించారు.

కేవలం ఓట్లు, సానుభూతి కోసం ఈటల చీఫ్‌ ట్రిక్స్‌ చేస్తున్నారని ఇక నుంచైనా మానుకోవాలని హితవు పలికారు. ఈటలను ప్రభుత్వం బయటకు పంపలేదని, ఆశలు పెరిగి పోయి చేసుకున్నారని, అది నీ కర్మ అన్నారు.  హుజూరాబాద్‌ ప్రజలు అమ్ముడుపోరని చెప్పిన ఈటల గడియారాలు, కుక్కర్లు ఎందుకు ఇస్తున్నావని ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు వొడితల సతీశ్‌కుమార్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశంయాదవ్, బస్వరాజు సారయ్య, జెడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు