నిజామాబాద్‌లో హోల్‌సేల్‌ చేపల మార్కెట్‌! 

6 Aug, 2022 02:32 IST|Sakshi

అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులకు మంత్రి తలసాని ఆదేశం  

సాక్షి,హైదరాబాద్‌: నిజామాబాద్‌లో అత్యాధునిక వసతులతో కూడిన హోల్‌సేల్‌ చేపల మార్కెట్‌ను నిర్మించడానికి గల అవకాశాలపై అధ్యయనం చేయాలని పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మసాబ్‌ ట్యాంక్‌లోని కార్యాలయంలో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన పలువురు మత్స్యకారులు తమ సమస్యలపై మంత్రిని కలిశారు.

వారి సమస్యలపై తలసాని సానుకూలంగా స్పందించారు. మత్స్యశాఖకు చెందిన స్థలంలో హోల్‌సేల్‌ చేపల మార్కెట్‌ నిర్మాణం చేపట్టేందుకు ఉన్నతస్థాయి అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని, తర్వాత కమిటీ నివేదిక ప్రకారం ప్రతిపాదనలను సిద్ధం చేయాలని మంత్రి తలసాని.. మత్స్యశాఖ కమిషనర్‌ లచ్చిరాం భూక్యాకు సూచించారు.

నిజామాబాద్‌ జిల్లాలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌తో పాటు ఇతర నీటి వనరుల ద్వారా పెద్ద ఎత్తున చేపల ఉత్పత్తి జరుగుతోందని, అక్కడ చేపల మార్కెట్‌ నిర్మాణం జరిగితే పరిసర ప్రాంతాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్న మత్స్యకారుల కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.  కాగా, అన్ని జిల్లా కేంద్రాలు, మున్సిపల్‌ కేంద్రాలలో ఆధునిక వసతులతో చేపల మార్కెట్‌ల నిర్మాణాలను చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు.   

మరిన్ని వార్తలు