విజయడెయిరీ లక్ష్యం.. వెయ్యి కోట్ల టర్నోవర్‌ 

10 Apr, 2022 03:18 IST|Sakshi
విజయ డెయిరీ ఐస్‌ క్రీం రుచి చూస్తున్న  మంత్రి తలసాని, డిప్యూటీ మేయర్‌ శ్రీలత తదితరులు 

విజయడెయిరీ పుష్‌కార్ట్స్‌ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి తలసాని  

సాక్షి, హైదరాబాద్‌/ఖైరతాబాద్‌: విజయడెయిరీ టర్నోవర్‌ను రూ.వెయ్యికోట్లకు చేర్చడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. మూసివేత దశకు చేరుకున్న విజయడెయిరీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రూ.750 కోట్ల టర్నోవర్‌కు చేరుకుందని చెప్పారు. డిమాండ్‌ దృష్ట్యా విజయ డెయిరీ ఉత్పత్తులను పెంచేందుకు రూ.250 కోట్ల వ్యయంతో మెగాడెయిరీని కూడా నిర్మిస్తున్నామని అన్నారు.

శనివారం ఇక్కడి నెక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా వద్ద జరిగిన కార్యక్రమంలో విజయ ఐస్‌క్రీంలకు సంబంధించిన 66 పుష్‌కార్ట్స్‌ (ట్రైసైకిల్స్‌)ను శ్రీనివాస్‌యాదవ్‌ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ విజయడెయిరీ వ్యాపార కార్యకలాపాలను విస్తరించడమే కాకుండా యువతకు ఉపాధి కల్పించేదిశగా ముందుకెళుతోందన్నారు. విజయ ఔట్‌లెట్‌ల నిర్వాహకులకు 50 శాతం సబ్సిడీపై ఫ్రిజ్‌లు, పుష్‌కార్ట్స్‌ ఇస్తున్నామని, దూద్‌పెడ, బటర్‌మిల్క్, లస్సీ, ఐస్‌క్రీంలు ఇలా ఎన్నో ఉత్పత్తులను యువత విక్రయించి ఉపాధి పొందేవిధంగా ఈ కార్ట్స్‌ అందిస్తున్నామని చెప్పారు.

పర్యాటక ప్రాంతాలు, పార్కులు, హైవేలు, దేవాలయాల వద్ద విజయ ఉత్పత్తులను విక్రయించేవిధంగా ఈ ట్రైసైకిల్స్‌ ఉపయోగపడతాయన్నారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా పాలు మనరాష్ట్రంలో ఉత్పత్తి కావడంలేదని, దీంతో ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా పాలను ఉత్పత్తి చేసేందుకు అవసరమైన చర్యల నిమిత్తం అధికారులతో ప్రత్యేక కమిటీని నియమించామన్నారు.

విజయడెయిరీకి పాలుపోసే రైతులకు లీటర్‌కు రూ.4 చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని ఇస్తున్నామని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో పశు సంవర్థక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అధర్‌ సిన్హా, డైరెక్టర్‌ రాంచందర్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, విజయ డెయిరీ అధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు