దుబ్బాకలో పూర్తి మెజార్టీతో గెలుస్తాం : త‌లసాని

27 Oct, 2020 16:18 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్ : దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో పూర్తి మెజార్టీతో గెలుస్తామ‌న్న విశ్వాసం ఉంద‌ని మంత్రి త‌లసాని శ్రీనివాస్ యాద‌వ్ అన్నారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోన్న అభివృద్ధే పార్టీని గెలిపిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ..  దుబ్బాక, సిధ్దిపేట ఎపిసోడ్ అంతా చూశామ‌ని, డ‌బ్బులు దొరికిన విష‌యం స్ప‌ష్ట‌మైంద‌న్నారు. బీజేపీ నేత‌ల తీరు దొంగ‌త‌నం చేసి దొంగ-దొంగ అని అరిచినట్లుంద‌ని ఆరోపించారు. వాస్త‌వాలు తెలుసుకోకుండా బీజేపీ నేత‌లు సిద్దిపేట వెళ్లార‌ని పేర్కొన్నారు. నిన్న‌టి హై డ్రామాలో  జితేందర్ రావు స‌హా  హరీష్ రావు,పద్మా దేవేందర్ రెడ్డి,సుజాత ఇంట్లో కూడా సోదాలు జరిగాయని స్ప‌ష్టం చేశారు. (‘కన్న తల్లిలాగా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటా’ )

బీజేపీ నేత‌లు నోరు ఉంది క‌దా అని ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. తెలంగాణ‌లో బీజేపీకి ఉన్న సంఖ్యాబ‌లం ఎంత అంటూ ప్ర‌శ్నించారు. మా క్యాడ‌ర్‌కి ఉన్న బ‌లం 60 ల‌క్ష‌లు. తెలంగాణ‌లో బీజేపీకి ఉన్న సంఖ్యాబ‌లం ఎంత‌?  మీలాగే ముట్ట‌డి చేస్తాం అని మా వాళ్లు అంటే ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎంపీ,కేంద్ర మంత్రి కూడా వెళ్లి నానా హైరానా చేశారు అని మండిపడ్డారు. పోలీసుల సెర్చ్‌లో బీజేపీ నేత‌ల ఇళ్ల‌లో డ‌బ్బులు దొరికిన మాట వాస్త‌వం కాదా అంటూ ప్ర‌శ్నించారు. బీజేపీ నేత‌లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నార‌ని, హైద‌రాబాద్ వ‌ర‌ద‌ల‌తో ప్ర‌జ‌లు ఎన్నో ర‌కాలుగా ఇబ్బందులు ప‌డ్డార‌ని, ఇప్ప‌టివ‌ర‌కు కేంద్రం నుంచి ఎలాంటి స‌హాయం అంద‌లేద‌ని వ్యాఖ్యానించారు. (ఎంపీ ఆరోపణలపై స్పందించిన సిద్దిపేట సీపీ )

మరిన్ని వార్తలు