మూడు బ్యారేజీలూ ప్రమాదంలోనే..

21 Jan, 2024 04:29 IST|Sakshi

కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఉమ్మడి రాష్ట్ర ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించలేదు

బీఆర్‌ఎస్‌ నాయకులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు 

మేడిగడ్డ డిజైన్‌లోనే లోపం ఉందని ప్రాథమిక సమాచారం 

త్వరలోనే డ్యామేజీ ఫొటోలు విడుదల చేస్తాం..అసెంబ్లీలో చర్చిస్తామని వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: స్వతంత్ర భారత చరిత్రలోనే కాళేశ్వరం ప్రాజెక్టు అంత నిర్లక్ష్యంగా నిర్మించిన ప్రాజెక్టు మరోటి లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ డిజైన్‌లోనే లోపం ఉందని ప్రాథమికంగా సమాచారం ఉందన్నారు. అలాగే, దాని నిర్మాణం, నిర్వహణ కూడా పూర్తి నిర్లక్ష్య పూరితంగా జరిగాయని చెప్పారు.

శనివారం ఆయన సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి మీడియాతో మాట్లాడారు. రూ. 94వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ప్రాజెక్టు 40వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇస్తుందని కాగ్‌ రిపోర్టు చెబుతోందని, అది కూడా కూలిపోయే స్థితికి చేరుకుందని ధ్వజమెత్తారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు వ్యాప్కో సంస్థ డిజైన్‌ చేసిందని, అందులో రూ.38వేల కోట్లతో 16 లక్షల ఎకరాలకు డిజైన్‌ చేసిందన్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మూడు బ్యారేజీలూ ప్రమాదంలోనే ఉన్నాయన్నారు. కాళేశ్వరం అంటే ఈ మూడు బ్యారేజీలు మాత్రమేనని, వీటినే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టిందని, పైనున్న ఎల్లంపల్లి, మిడ్‌ మానేరు, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్మించినవేనని వివరించారు. అన్నారం బ్యారేజీ తీవ్రంగా దెబ్బతిందని, డ్యామేజీతోపాటు నిర్లక్ష్యం కూడా చోటుచేసుకుందని, వీటికి సంబంధించిన ఫొటోలు త్వరలోనే విడుదల చేస్తామని ఉత్తమ్‌కుమార్‌ చెప్పారు.  

కృష్ణా బోర్డుకు అప్పగించలేదు 
కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కు ఇస్తామని ఎలాంటి హామీ ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలోనే కృష్ణానీటి దుర్వినియోగం జరిగిందని, వాళ్ల తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు ప్రచారం ప్రారంభించారని ధ్వజమెత్తారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కేఆర్‌ఎంబీ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏదో ఒప్పందం చేసుకుందని దు్రష్పచారం చేయడం సిగ్గుచేటన్నారు.

గత డిసెంబర్‌ 7న తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టుల స్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని చెప్పారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలో రాష్ట్రానికి కృష్ణా నీటి వాటా ఎందుకు తగ్గిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వారు చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో ముఖ్యమంత్రి రేవంత్, తాను సమావేశమైనప్పుడు కేఆర్‌ఎంబీపై య«థాతథస్థితి కొనసాగించాలని చెప్పినట్లు తెలిపారు.

ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించి ప్రజల ముందు పెట్టనున్నట్లు చెప్పారు. కాళేశ్వరంపై పలు విచారణలు సాగుతున్నాయని, పూర్తి వివరాలతో నిపుణులే మాట్లాడతారన్నారు. విధ్వంసక మైండ్‌ సెట్‌ ఉన్నోళ్లే కరెంట్‌ బిల్లు కట్టొద్దని అంటున్నారని, విద్యుత్‌ శాఖలో రూ.వేలకోట్ల అప్పులు చేసి బిల్లులు కట్టొద్దని మాట్లాడటం శోచనీయమని అన్నారు. 

>
మరిన్ని వార్తలు