జూన్‌ నాటికి రామగుండం వైద్య కళాశాల 

18 Mar, 2022 02:09 IST|Sakshi

మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: గోదావరిఖనిలో నిర్మిస్తున్న రామగుండం వైద్య కళాశాల జూన్‌ నాటికి మొదటి సంవత్సరం విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. కొత్తగా ప్రభుత్వం నిర్మిస్తున్న 8 వైద్య కళాశాలల నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆదేశాల మేరకు గురువారం మంత్రుల నివాస సముదాయంలోని తన అధికారిక నివాసంలో ఆర్‌ అండ్‌ బీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పేదలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ కొత్తగా 8 జిల్లాల్లో వైద్య కళాశాలలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు.

ముఖ్యమంత్రి ఆదేశానుసారం వీటి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నిబంధనల మేరకు నిర్మాణాలు ఉండాలని అధికారులను ఆదేశించారు. మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, నాగర్‌ కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు వైద్య కళాశాలలు ఏప్రిల్‌లోనే పూర్తవుతాయన్నారు.

ఫస్టియర్‌ విద్యార్థుల కోసం భవన నిర్మాణాలు పూర్తైన చోట మెడికల్‌ కాలేజీ నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులను టీఎస్‌ఎండీసీ అ«ధికారులతో సమన్వయం చేసుకోవాలని ఈఎన్సీ గణపతి రెడ్డిని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో ఆర్‌ అండ్‌ బి కార్యదర్శి శ్రీనివాసరాజు, ఈఎన్సీ గణపతి రెడ్డి, సీఈ సతీశ్‌ పలువురు అధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు