గడువులోపు సచివాలయం, స్మారక భవనాలు పూర్తవ్వాలి 

2 Nov, 2021 01:18 IST|Sakshi

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ విధించిన గడువులోపు కొత్త సచివాలయం, అమరవీరుల స్మార కభవన నిర్మాణాలు పూర్తి కావాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం ఆయన ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు. సచివాలయ పనులు జరుగుతున్న తీరుపట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. అయితే ఇంకా పనుల్లో వేగం పెంచాలని పేర్కొన్న ఆయన.. సచివాలయంలో ముఖ్యమంత్రి, మంత్రుల చాం బర్లు, అధికారుల కార్యాలయాలకు సంబంధించిన డిజైన్లను అంతస్తులవారీగా పరిశీలించారు.

గతంలో సీఎం చేసిన మార్పులకు తగ్గట్టు తుది ప్లాన్స్‌ను సమర్పించాలని వేముల ఆదేశించారు. అమరవీరుల స్మారక భవనం ఎలా ఉండబోతుందనే విషయంలో అధికారులు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మంత్రికి వివరించారు. భవనం పైభాగంలో నిరంతరం జ్వలించేలా చేసే ఏర్పాట్లు ప్రత్యేకంగా ఉం డాలని, దానిపై దృష్టి సారించాలని సూచించారు. ప్రవేశమార్గం వద్ద అమరవీరులకు చిన్నారులతో నివాళులర్పించేలా ఉండే డిజైన్, పచ్చిక బయళ్లు, ఆడియో వీడియో ప్రాంగణం తదితర డిజైన్లపై చర్చించారు.

ప్రవేశంలో తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం తెలుగులో ఉండాలన్నారు. అమరుల ఫొటో ఎగ్జిబిషన్‌ ప్రాంగణం, కాన్ఫరెన్స్‌ హాలు, రెస్టారెంట్‌ ప్లాన్లను పరిశీలించారు. సమావేశంలో రోడ్లు, భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఈఎన్‌సీ గణపతిరెడ్డి, ఇతర ఇంజ నీరింగ్‌ అధికారులు పద్మనాభరావు, లింగారెడ్డి, సత్యనారాయణ, శశిధర్, నర్సింగరావు, వాస్తు నిపుణులు సుధాకర్‌ తేజ, ఆర్కిటెక్ట్‌ ఆస్కార్‌ పొన్ని పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు