లక్ష ఎకరాల్లో పంట నష్టం!

18 Mar, 2023 02:01 IST|Sakshi

రైతుకు కడగండ్లు మిగిల్చిన వడగళ్లు 

పలు జిల్లాల్లో దెబ్బతిన్న వరి, మిర్చి, మొక్కజొన్న పంటలు 

కూరగాయలు, ఉద్యాన పంటలకూ అపార నష్టం 

వికారాబాద్‌ జిల్లాలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబిత, ఎమ్మెల్సీ పల్లా ఏరియల్‌ సర్వే 

దెబ్బతిన్న పంటల పరిశీలన.. రైతులను ఆదుకుంటామని హామీ 

సాక్షి, హైదరాబాద్‌/నల్లగొండ అగ్రికల్చర్‌/ మర్పల్లి/ వికారాబాద్‌:  రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, వడగళ్లు అన్నదాతలను నిండా ముంచాయి. సుమారు లక్ష ఎకరాల్లో పంటలను దెబ్బతీశాయి. వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన వడగండ్ల వానలతో వరి, మామిడి, నిమ్మ, బత్తాయి, పుచ్చ, టమాటా, బీరకాయ, మొక్కజొన్న, పచ్చిమిర్చి, బొబ్బర్లు, మినుము పంటలకు భారీ నష్టం వాటిల్లింది. అనేక చోట్ల వరి నేలవాలగా కొన్ని ప్రాంతాల్లో మక్కలు తడిసి ముద్దయ్యాయి.

అలాగే మామాడి, బత్తాయి, నిమ్మ తోటల్లో పిందెలు, కాయలు రాలిపోయాయి. పచ్చిమిరప చేన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వికారాబాద్‌ జిల్లాలో అత్యధిక పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నల్లగొండ జిల్లాలో 1,060 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి నివేదించారు. వికారాబాద్‌ జిల్లాలోని మర్పల్లి, మోమిన్‌పేట మండలాల్లో దెబ్బతిన్న ఉద్యాన, వ్యవసాయ పంటలను మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెలికాప్టర్‌ ద్వారా పరిశీలించారు.

వడగండ్ల వాన తీవ్రత ఎక్కువగా ఉందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. క్యాబేజీ, ఉల్లి, మొక్కజొన్న, పుచ్చకాయ, క్యాప్సికం పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వికారాబాద్‌ జిల్లాలో రెండు వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చామని మంత్రి పేర్కొన్నారు.  

సాగు విధానంలో మార్పు అవసరం  
మన దేశంలో వ్యవసాయానికి ఓ విధానమంటూ లేదని, దీనిని సరిచేసే విషయమై కేంద్రం చొరవ తీసుకోవాలని మంత్రి నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని అనేకసార్లు కేంద్రాన్ని కోరినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 72 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని వివరించారు.

మార్చి, ఏప్రిల్‌లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉందని, ఈలోగా పంటలు చేతికి వచ్చేలా సాగువిధానంలో మార్పులు రావాలన్నారు. నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, సూర్యాపేట ప్రాంతాల్లో రైతులు పంటలు  నష్టపోకుండా సీజన్‌లో మార్పులు చేసుకుంటున్నారని, ఈ ప్రాంత రైతులు కూడా ఆ దిశగా అవగాహన పెంచుకోవాలని సూచించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, వ్యవసాయ శాఖ  కమిషనర్‌ రఘునందన్‌రావు, ఉద్యానవన శాఖ  సంచాలకులు హన్మంతారావు, కలెక్టర్‌ నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.  

రైతులకు వ్యవసాయ వర్సిటీ సూచనలు... 
రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్న నేపథ్యంలో ఆరుతడి పంటలు, కూరగాయలు పండించే రైతులు పొలాల్లో అధిక వర్షపు నీరు బయటకు పోవడానికి వీలుగా మురుగు కాల్వలు ఏర్పాటు చేసుకోవాలని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్‌ ఎం.వెంకటరమణ సూచించారు. చీడపీడలు, తెగుళ్ల ఉధృతి అధికం కాకుండా ఉండేందుకు నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. 

మరిన్ని వార్తలు