నర్సన్న మరణం తెలంగాణకు తీరని లోటు

22 Oct, 2020 11:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర మాజీ హోంమంత్రి, కార్మిక నాయకుడు నాయిని నర్సింహారెడ్డి (80) బుధవారం అర్ధరాత్రి దాటాక కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి  అర్ధరాత్రి విషమించడంతో నాయిని తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన కోవిడ్‌ బారిన పడ్డారు. దాని నుంచి కోలుకున్న తర్వాత నిమోనియా సోకిన విషయం తెలిసిందే. నాయిని మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్మిక సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.   

నర్సన్న మరణం పార్టీకి, తెలంగాణకు తీరనిలోటు:
మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మరణం టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అయిదు దశాబ్దాలుగా ప్రజల మనిషిగా ఆయన రాజకీయాల్లో, కార్మికనేతగా పనిచేశారని, 1969 తెలంగాణ ఉద్యమంలో, 2001 నుండి మలిదశ తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర అనన్య సామాన్యమని గుర్తు చేశారు. 2001 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమ సమయంలో వారితో ఉన్న అనుబంధం మరువలేనిదని, నర్సన్న ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం:
నాయినితో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. ఉద్యమాలు, త్యాగాలు, పదవులు ఆయన నుంచి నేర్చుకున్న పాఠాలని తెలిపారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు.

నాయిని చనిపోవడం బాధాకరం:
తెలంగాణ ఉద్యమంలో నాయిని కీలక పాత్ర పోషించారని  ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బి. వినోద్ కుమార్‌ అన్నారు. 2001 నుంచి ఆయనతో ఎన్నో విషయాలు చర్చించుకున్నామని తెలిపారు. తొలి హోంమంత్రిగా పనిచేశారని,1975 ఎమర్జెన్సీ కాలంలో రైల్వేను స్తంభింపచేసిన వ్యక్తి అని గుర్తు చేశారు. హైదరాబాద్, హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కార్మిక సంఘ ఎన్నికల్లో గెలిచారని అన్నారు.

కార్మిక పక్షపాతి
నాయిని నర్సింహారెడ్డి కార్మిక పక్షపాతి అని, వారి హక్కుల్ని కాపాడారని మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు. ఆయన మరణం చాలా బాధకమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాయినిది  చిన్నపిల్లల మనస్తత్వమని ఆయన మృతికి తీవ్ర సంతాపం ప్రకటించారు. మంత్రుల నివాస ప్రాంగణంలో నాయిని పార్థివదేహాన్ని ఆయన ఉదయం తన సతీమణి సునీతా జగదీష్ రెడ్డితో కలసి సందర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దేవరకొండ ప్రాంతం నుండి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి కార్మిక నాయకుడిగా తొలి తెలంగాణా ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేశారని అన్నారు. ఉద్యమ సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ బాధ్యతలు పంచుకున్న నేతగా నాయిని అందించిన సేవలను మంత్రి జగదీష్ రెడ్డి స్మరించుకున్నారు. ఉద్యమ కాలం నుండి తొలి తెలంగాణా మంత్రి వర్గంలో నాయినితో తనకున్న సంబంధాలను గుర్తు చేసుకున్నారు. అటువంటి నేత మరణం తీరని లోటు అని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు మరింత ధైర్యంగా ఉండాలని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

నాయిని మరణం అత్యంత బాధాకరం
నాయిని నర్సింహారెడ్డి మరణం అంత్యంత బాధకరమని  మంత్రి హరీష్‌ రావు అన్నారు. తొలి మలిదశ ఉద్యమాల్లో నాయిని పోరాటం గొప్పది గుర్తుచేశారు. కార్మికులు, పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేశారని అన్నారు. ఆయన లేని లోటు ఎన్నటికి పూడ్చలేనిదని తెలిపారు.

నాకు అత్యంత ఆత్మీయుడు 
నాయిని తనకు అత్యండ ఆత్మీయుడని కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నారు. నల్గొండ  జిల్లా వాసి అని, ఆయన తమకు ఆదర్శం అన్నారు. నాయిని చనిపోవడం బాధాకరమని తెలిపారు. ఆయన్ని చూసి ప్రభావితుడనై రాజకీయాల్లోకి వచ్చానని జానారెడ్డి అన్నారు.

కార్మిక నాయకునిగా సుదీర్ఘ కాలం:
నాయిని నర్సింహారెడ్డి మరణం పట్ల ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు. కార్మిక నాయకునిగా సుదీర్ఘ కాలం రాజకీయ జీవితం గడిపిన నేత నాయిని అని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటాల్లో కలిసి వచ్చేవారని అ‍న్నారు. తెలంగాణ రాష్ట్ర మొట్ట మొదటి హోంమంత్రిగా పనిచేసిన నరసింహారెడ్డి మరణం బాధాకరం అన్నారు. ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

నిబద్ధత గల నాయకుడు
తెలంగాణ తొలి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నాయిని నరసింహారెడ్డి కార్మికుల పక్షపాతి అని, తన జీవితాంతం కార్మికుల అభివృద్ధి కోసమే పాటుపడ్డారని గుర్తు చేశారు. ఆయన చాలా నిబద్ధత గల నాయకుడు అని తెలిపారు. నాయిని తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి సీఎం కేసీఅర్ వెంట నడిచిన వ్యక్తి అని అన్నారు. కార్మికుల కొరకు తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మొదటి హోం మంత్రిగా పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు చేపట్టారని గుర్తుచేశారు. అందరినీ తమ్మి.. బాగున్నావా.. అంటూ పలకరించే ఎటువంటి కల్మషం లేని వ్యక్తి నాయిని అని గుర్తు చేసుకున్నారు. నాయకుని మృతి కార్మిక లోకానికి, తెలంగాణ ప్రజలకు తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నానని తెలిపారు.ఆయన కుటుంబానికి  ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేశారు.

తెలంగాణ పోరాట యోధుడు:
మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆకస్మిక మృతి పట్ల రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో పాల్గొన్న తెలంగాణ పోరాట యోధుడు నాయిని అని గుర్తు చేశారు. కార్మిక నాయకుడిగా  ఉంటూ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి  అన్నారు. ఆయన మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు అన్నారు.
నాయిని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి  తెలిపారు.

నర్సన్న లేకపోవడం బాధాకరం
నాయిని నర్సింహారెడ్డి పార్థివ దేహానికి మంత్రి మల్లారెడ్డి నివాళులు అర్పించారు. కార్మిక నాయకులు నర్సన్న లేకపోవడం బాధాకరం అన్నారు. కార్మిక లోకానికి నాయిని చేసిన సేవలు మరచిపోలేమని తెలిపారు. ప్రభుత్వాలతో కోట్లాడి కార్మికుల హక్కులను  కాపాడే వారు నాయిని అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నాయిని చేసిన పోరాటం మరచిపోలేమన్నారు.

  • తెలంగాణ తొలి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పార్థివ దేహానికి తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ నివాళులు అర్పించారు.
  • నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి సమరసింహారెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
  • నాయిని నర్సింహారెడ్డి మృతి చాలా బాధాకరం: డిప్యూటీ స్పీకర్ పద్మారావు

మరిన్ని వార్తలు