Hyderabad: కోర్టు అనుమతితో మైనర్‌ బాలికకు గర్భస్రావం 

1 Apr, 2022 07:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌(బంజారాహిల్స్‌): పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన బాలిక.. తన భవిష్యత్‌ నిమిత్తం గర్భస్రావానికి ఆదేశించాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. మానవతా దృక్పథంతో స్పందించిన న్యాయస్థానం సదరు బాలిక గర్భస్రావానికి అనుమతినిస్తూ  ఆదేశాలు జారీ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడి (25)కి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వీరిని వదిలేసి అతను నగరానికి వచ్చాడు. బంజారాహిల్స్‌లోని ఓ బస్తీలో తన దూరపు బంధువుతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో 8 వ తరగతి చదువుతున్న ఆమె కూతురిపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు.

బాలిక తల్లి ఈ విషయాన్ని కనిపెట్టి కూతురితో కలిసి వెస్ట్‌జోన్‌ పరిధిలోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించింది. రెండు వారాల క్రితం పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలిక మైనర్‌ కావడం, గర్భం కూడా దాల్చడంతో భవిష్యత్‌లో ఎదురయ్యే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని గర్భస్రావం చేయించుకోవడానికి అనుమతి కోరుతూ అత్యున్నత న్యాయస్థానాన్ని తల్లిదండ్రులతో కలిసి ఆశ్రయించింది. నాలుగు రోజుల క్రితం హైకోర్టు ఆ బాలిక గర్భస్రావానికి అనుమతినిస్తూ నిలోఫర్‌ ఆస్పత్రి వైద్యులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం వైద్యులు మైనర్‌ బాలికకు గర్భస్రావం చేసినట్లు పోలీసులు తెలిపారు.   

చదవండి: (Hyderabad: ప్రయాణికులకు మెట్రో రైలు బంపర్‌ ఆఫర్‌)

మరిన్ని వార్తలు