వరంగల్‌లో అమానుషం.. అన్నా అని పిలిచినా వదల్లేదు..

6 Jan, 2023 10:57 IST|Sakshi

మాయమాటలతో నమ్మించి పలుమార్లు లైంగికదాడి 

బాలిక ఇన్‌స్టాగ్రామ్‌కు అసభ్యకర సందేశాలు 

బాలిక తండ్రి వాటిని చూడటంతో బయటపడిన దారుణం 

వరంగల్‌లో ఘటన  

ఖిలా వరంగల్‌: తెలిసీ తెలియని వయసు.. దగ్గరలోనే ఇల్లు.. ఆ బాలికకు మాయమాటలు చెప్పిన ఇద్దరు అన్నదమ్ములు శారీరకంగా లొంగదీసుకున్నారు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన గురువారం వరంగల్‌లో వెలుగులోకి వచి్చంది. పోలీసుల కథనం ప్రకారం.. బతుకుదెరువు కోసం ఇద్దరు కుమార్తెలతో కలసి దంపతులు వరంగల్‌కు వలస వచ్చారు. వెంకట్రామ జంక్షన్‌ సమీప కాలనీలోని బంధువుల ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. 

వారి పెద్ద కుమార్తె పదో తరగతి, చిన్న కుమార్తె 8వ తరగతి చదువుతున్నారు. కాగా, దయానంద్‌ కాలనీకి చెందిన ఓ పాత ఫరి్నచర్‌ షాపు యాజమాని ఎండీ ఆయూబ్‌ అలీకి అజ్మత్‌ అలీ(26), అక్బర్‌ అలీ(22) అనే కుమారులు ఉన్నారు. వీరిద్దరూ పదో తరగతి చదివే బాలికపై కన్నేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ బాలికతో వీరికి పరిచయం ఏర్పడింది. బాలిక ఇద్దరినీ అన్నా అంటూ పిలిచేది. దీంతో వారి మధ్య చనువు ఏర్పడింది. కానీ అన్నదమ్ములు ఆ బాలికకు మాయమాటలు చెప్పి, ఒంటరిగా ఉన్నది చూసి ఇంట్లోకి రప్పించుకుని ఒకరికి తెలియకుండా మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా ఆరునెలలుగా బాలికపై పలుమార్లు వేర్వేరుగా లైంగికదాడికి పాల్పడ్డారు. 

బాలిక ఇన్‌స్టాగ్రామ్‌కు వారు అసభ్యకరమైన మెసేజ్‌లు పోస్ట్‌ చేయడంతో ఇటీవల విషయం తండ్రికి తెలిసింది. తల్లిదండ్రులు కుమార్తెను నిలదీయడంతో అన్నదమ్ములు అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పింది. బాలిక తల్లి బుధవారం రాత్రి మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఎండీ అజ్మత్‌ అలీ, అక్బర్‌ అలీపై ఫిర్యాదు చేసింది. నిందితులిద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ ముస్క శ్రీనివాస్‌ తెలిపారు. నిందితులిద్దరినీ పోలీసులు బుధవారం రాత్రే అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై ఇన్‌స్పెక్టర్‌ను వివరణ కోరగా నిందితులు పరారీలోనే ఉన్నారని తెలిపారు. బాలికపై ఇద్దరు యువకులు లైంగికదాడికి పాల్పడిన ఘటనను నిరసిస్తూ గురువారం బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు. నిందితుల ఇంటిపై దాడి చేసి కిటికీ అద్దాలు, ఆవరణలోని ద్విచక్రవాహనాలను ధ్వంసం చేశారు. అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో వెంకట్రామ జంక్షన్‌ నర్సంపేట రోడ్డుపై ధర్నా నిర్వహించారు. కాగా, వరంగల్‌ ఏసీపీ కల్కోట్లు గిరికుమార్‌ బాలికను, ఆమె తల్లిదండ్రులను పరామర్శించారు.

మరిన్ని వార్తలు