Warangal: ఎవరిదీ పాపం.. కామాంధుల చేష్టలకు గర్భం దాలుస్తున్న మైనర్లు

12 Jan, 2022 15:45 IST|Sakshi
ఎంజీఎంలో పుట్టిన బిడ్డను జిల్లా బాలసంరక్షణ విభాగాధికారులకు ఇస్తున్న సిబ్బంది (ఫైల్‌) 

తెలిసీ తెలియని వయసులోనే శిశువులకు జననం

వివాహేతర సంబంధంతో పిల్లలకు జన్మనిస్తున్న కొందరు మహిళలు

కన్నోళ్లెవరో తెలియకుండా శిశు విహార్‌లో పెరుగుతున్న చిన్నారులు

ఏడాదిలో 15 మంది పసికూనలు పేగుబంధానికి దూరం

సాక్షి, వరంగల్‌: ‘పరకాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక హైదరాబాద్‌లో తల్లిదండ్రులతో కలిసి నివాసముంటోంది. అక్కడ పరిచయమైన ఓ వ్యక్తి ఆమెను మాటలతో లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత శారీరక సంబంధం ఏర్పర్చుకున్నాడు. ఈ విషయం ఆరు నెలలయ్యాక బాధితురాలి తల్లిదండ్రులకు తెలిసింది. అబార్షన్‌ చేయిద్దామంటే వీలు లేకపోవడంతో తొమ్మిది నెలలు చూసి వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో ఇటీవల ప్రసవం చేయించారు. ఆ తర్వాత పాపను ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లారు’.

‘నెక్కొండ మండలంలోని ఓ తండాకు చెందిన 24 ఏళ్ల వివాహిత తొలి సంతానంలో బిడ్డకు జన్మనిచ్చింది. భర్త చనిపోవడంతో మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పర్చుకుంది. అతడు కూడా ఆమెను నమ్మించి గర్భం చేశాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. దీంతో ఆమె ఓ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాపను చూడనని, తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఆమె వదిలించుకుంది’.

ఇలా ఓ బాలిక, ఓ మహిళ తప్పుదారి పట్టడంతో వారికి పుట్టిన బిడ్డలు పేగుబంధానికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. విషయం తెలిస్తే ఎవరూ పెళ్లి చేసుకోరని బాలిక, భర్త చనిపోయినా రెండో బిడ్డకు ఎలా జన్మనిచ్చిందని మరొకావిడ కన్న బిడ్డలను దూరం చేసుకున్నారు. వారికి జన్మించిన పసికూనలిద్దరూ ఇప్పుడు వరంగల్‌ జిల్లాలోని హనుమకొండ శిశు విహార్‌లో పెరుగుతున్నారు. ఆ పసిబిడ్డలిద్దరూ ఏ పాపం చేయకున్నా పేగుబంధానికి దూరం కావడం కన్నీళ్లు పెట్టిస్తోంది. వీరిద్దరే కాదు.. ఇలా వివాహం చేసుకోకుండా ఎనిమిది మందికి జన్మించిన పిల్లలు, వివాహేతర సంబంధం, ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం, మూడో కాన్పులోనూ ఆడపిల్ల తదితర కారణాలతో జన్మించిన మరో ఏడుగురు.. ఇలా మొత్తం 15 మంది పసికూనలు కన్నవారి ఆప్యాయతానురాగాలు లేక శిశు విహార్‌ పాలయ్యారు. 

చదవండి: (జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం.. ఫైళ్లు దగ్ధం)

తప్పే శాపమాయె..
ఇటు పోలీసులు, అటు షీటీం బృందాలు ఎంత అవగాహన కలిగిస్తున్నా.. తెలిసీ తెలియని వయసులో అమ్మాయిలు దారి తప్పుతున్నారు. కుటుంబ పోషణకు తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు, ఇతర పనులకు వెళ్తుండటంతో వీరిపై పర్యవేక్షణ కరువవడం.. పిల్లలు ఏమి చేస్తున్నారనే విషయం కూడా వీరికి తెలియకపోవడంతో ఇటువంటి పరిణామాలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో ఇటు మగ, అటు ఆడపిల్లలు ఎవరి దారుల్లో వారు వెళ్తున్నారు. ప్రేమ పేరుతో మైనర్లకు లొంగదీసుకుని లైంగిక దాడులకు పాల్పడుతుండటంతో చివరకు తల్లులవుతున్న ఘటనలు చూస్తున్నాం. తొలినాళ్లలో తెలిస్తే తల్లిదండ్రులు అబార్షన్‌ చేయించి పెళ్లిళ్లు చేసేస్తున్నారు. కాస్త ఆలస్యంగా తెలిస్తే డెలివరీ చేయించి ఆ ఆస్పత్రిలోనే పాపను వదిలేసి వెళ్తున్నారు.

ఈ విషయం వైద్య సిబ్బంది ద్వారా జిల్లా బాలల సంరక్షణ విభాగాధికారులకు తెలియడంతో వారు బాలల సంరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పసికూనలకు శిశు విహార్‌కు తరలిస్తున్నారు. ఇలా శిశు విహార్‌లో ఉన్న పిల్లలను చట్టప్రకారంగా ముందుకొచ్చే దంపతులకు దత్తత ఇస్తున్నారు. ‘అసలు తల్లిదండ్రులెవరో తెలియకుండానే వారి జీవితం ముందుకెళ్తోంది. ప్రేమ పేరుతో శారీరక సంబంధాల వరకు వెళ్లొద్దు. వివాహేతర సంబంధాలు పెట్టుకోవద్దు. మీరు వేసే తప్పటడుగులు పిల్లలకు శాపంగా మారొద్దు. ఇప్పటికైనా సమాజంలోని ప్రతి ఒక్కరూ దీనిని గమనించాలి’ అని ఓ ప్రభుత్వ విభాగాధికారి అంటున్నారు. 

మరిన్ని వార్తలు