ప్రాణాలు తీస్తున్న క్షణికావేశం.. ఈ లక్షణాలుంటే అనుమానించాల్సిందే.. ​​​​​​​

20 Apr, 2022 14:11 IST|Sakshi

సుల్తానాబాద్‌ మండలం కనుకులకు చెందిన ఇద్దరు మైనర్లు ప్రేమించుకున్నారు. పెద్దలు నిరాకరించడంతో అబ్బాయి పురుగుల మందు తాగి సోమవారం మృతిచెందగా.. అమ్మాయి మంగళవారం బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. 

తాను ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని గోదావరిఖని ప్రాంతానికి చెందిన 25ఏళ్ల యువకుడు ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నాయి. 


 

సాక్షి, పెద్దపల్లి: ‘తన కోపమే తన శత్రువు.. తన శాంతమే తనకు రక్ష’ అనే సామెతను మరిచి క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతూ కుటుంబాలను విషాదంలో ముంచుతున్నారు కొందరు. సమస్యను ఇతరులతో పంచుకోకుండా.. పరిష్కారం కనుక్కోకుండా విలువైన ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ప్రేమలో వైఫల్యం, కుటుంబంలో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, సాగులో నష్టం, దీర్ఘకాలిక రోగాలు, క్షణికావేశం, మనస్పర్థలు, మానసిక సమస్యలతో లోకం విడిచి వెళ్లిపోతున్నారు. సమస్యలు అధిగమించలేక రకరకాల కారణాలతో జిల్లాలో ఏదో ఒకచోట ఆత్మహత్యకు పాల్పడుతున్న సంఘటనలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో 15 నుంచి 35 ఏళ్లలోపు యువత, మహిళలలే ఎక్కువగా ఉంటున్నారు.

కన్నవారికి గుండెకోత..
సుల్తానాబాద్‌ రూరల్‌: మండలంలోని కనుకులకు చెందిన మైనర్లు ఆత్మహత్య చేసుకుని కన్నవారికి గుండెకోత మిగిల్చారు. ఇరుకుటుంబాల్లో తీరని శోకాన్ని కలిగించారు. ఇద్దరిదీ తెలిసీ తెలియని వయసు కావడం.. ప్రేమలో ఉన్నామని భ్రమపడి.. పెద్దలు ఎంత చెప్పినా వినకుండా ప్రాణాలు తీసుకున్నారు. గ్రామానికి చెందిన ఓ అబ్బాయి తొమ్మిదో తరగతి వరకు చదువుకుని ఇంటివద్దనే ఖాళీగా ఉంటున్నాడు. తండ్రి చనిపోవడంతో తల్లి అన్నీతానై పోషిస్తోంది. కూలీ పనులు చేసుకుంటూ కొడుకును అల్లారుముద్దుగా చూసుకుంటోంది.

ఇంతలోనే ప్రేమ పేరిట అఘాయిత్యానికి పాల్పడడం ఆమెకు తీరని వేదన కలిగిస్తోంది. అదే గ్రామానికి చెందిన అమ్మాయి కూడా పదో తరగతి వరకు చదువుకుని ఇంటివద్దనే ఉంటోంది. వారి ఇద్దరి ఇళ్లు సమీపంలోనే ఉండడంతో వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి జీవించాలని అనుకున్నా.. కులం అడ్డురావడం.. పెద్దలు అంగీకరించకపోవడంతో ఒకరి తర్వాత మరొకరు ప్రాణాలు తీసుకున్నారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.  
 

ఇలాంటి వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడుతారు
► ఆత్మవిశ్వాసం కోల్పోయిన వ్యక్తులు..
► చదువులో వెనుకబడి.. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చలేకపోతున్నామనుకునేవారు.
► మత్తుపదార్థాలకు అలవాటుపడిన వ్యక్తులు..
► సమాజంలో పరువు పోతుందని, ఎదుటివారు తప్పుగా మాట్లాడతారనుకునేవారు. 
► కుటుంబం, ఆస్తి తగాదాలు భార్యాభర్తల మధ్య నమ్మకం లేని వ్యక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతుంటారు.

ఈ లక్షణాలుంటే అనుమానించాల్సిందే.. 
► ఒకచోట కుదురుగా ఉండకుండా అటూఇటూ తిరుగుతుండటం..
► ఏ పని మీదా ఆసక్తి చూపకపోవడం.. చేసే పనిమీద ఆసక్తి లేకపోవడం..
► ప్రతి చిన్న విషయానికీ ఎదుటి వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం..
► చీకటిలో ఎక్కువ సమయం గడపడం.. దిగాలుగా, దుఃఖంతో ఉండటం..
► ఎవరిని కలువకుండా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడటం.. అనుకున్నది సాధించలేకపోయామనే నిర్వేదం..
► జీవించడం ద్వారా ఎవరికీ ఉపయోగం లేదనుకోవడం.. వంటి లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తులను అనుమానించాలి.

సంకేతాల్ని గుర్తించాలి
ఎవరూ ఎటువంటి సంకేతాలు ఇవ్వకుండా ఆత్మహత్యలకు పాల్పడరు. వారి ప్రవర్తన, మాటల ద్వారా తమ ఆలోచనల్ని వ్యక్తీకరిస్తారు. వీటిని సైకాలజీలో ఆత్మహత్య హెచ్చరిక సంకేతాలుగా చెబుతారు. ఈ సంకేతాలపై అవగాహన ఉంటే ఆత్మహత్య ఆలోచన ఉన్నవారిని గుర్తించి కాపాడే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యార్థులు వీటిపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది.
– కె.రామచంద్రం, సైకాలజీ కేయూ

సదస్సులు నిర్వహిస్తాం
ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. కోపం దరిచేరనివ్వకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే స మస్యలు దూరమవుతాయి. విలువైన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్పితే అర్ధాంతరంగా ముగించడం తగదు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు గ్రామాల్లో మండల లీ గల్‌ సర్వీస్‌ అథారటీల ద్వారా న్యాయ, విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తాం. కేసులు రాజీ చేసుకునేలా లోక్‌ అదాలత్‌ ద్వారా ప్రోత్సహిస్తున్నాం.
– సురేష్‌బాబు,  బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, పెద్దపల్లి  

ఆత్మహత్యలు పరిష్కారం కాదు
సమస్యలకు ఆత్మహత్యలు ప రిష్కారం కాదు. విపరీతమైన ఒ త్తిడి, కోపం, అసహనంలో పుట్టిన నిరాశ, నిస్పృహల ద్వారా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. కు టుంబ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు మెరుగు పర్చుకోవటం ద్వారా జీవితానికి భరోసా కలుగజే యవచ్చు. ఆ దిశగా స్నేహితులు, బంధువులు భరోసా ఇవ్వాలి.
– పి.రవీందర్, డీసీపీ   

►మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు