దేవతలు తాగింది కల్లే: శ్రీనివాస్‌గౌడ్

24 Mar, 2021 07:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కల్లును తక్కువ చేసి చూడటం సరికాదని, అది దేవతలు తాగిన పానీయమని అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మంగళవారం శాసనసభలో వెల్లడించారు. దేవతలు సురాపానం చేయటమంటే.. చెట్టు నుంచి గీసిన కల్లు తాగటమేనని ఆయన స్పష్టం చేశారు. కల్లు ఆధారంగా ఎన్నో కులవృత్తుల వారికి లబ్ధి చేకూరుతోందని, అందుకే అది పెద్ద కుటీర పరిశ్రమేనని వెల్లడించారు.

కల్లు దుకాణాలను ఆసరా చేసుకుని ఇతర కులవృత్తుల వారి ఉత్పత్తుల వినియోగం జరుగుతోందని, ఫలితంగా వారు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారన్నారు. కల్లు గీసేవారు ఆర్థికంగా బలోపేతమవటాన్ని చూసి ఓర్వలేక గత ప్రభుత్వాల హయాంలో నగరంలో కల్లు దుకాణాలను రద్దు చేశారని, కానీ వాస్తవాలు గుర్తించిన ఈ ప్రభుత్వం మళ్లీ తెరిపించిందని పేర్కొన్నారు. చెట్టు పన్ను పేర అప్పట్లో వేధించేవారని, దాన్ని ఈ ప్రభుత్వం దూరం చేసిందని పేర్కొన్నారు.  

మంత్రులూ క్లుప్తంగా మాట్లాడండి: స్పీకర్‌ 
పద్దులకు సంబంధించి చర్చ అనంతరం మంత్రులు సమాధానం ఇచ్చే సమయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం పొద్దుపోయేవేళకి కేవలం ఆరుగురు మంత్రులే సమాధానం చెప్పారు. మరో ఐదారుగురు సమాధానం ఇవ్వాల్సి ఉంది. సమయాన్ని దృష్టిలో ఉంచుకుని మంత్రులు మాట్లాడాలని స్పీకర్‌ పదేపదే పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడే ముందు కూడా ఇదే సూచన చేశారు.

దీంతో ‘మీరు వ్యవసాయ మంత్రిగా ఉండగా పద్దులపై మాట్లాడటాన్ని మేం ఆసక్తిగా వినేవాళ్లం. కొన్నిసార్లు రాత్రి 12 గంటల సమయంలో కూడా మీరు మాట్లాడారు. మిమ్మల్నే మేం ఆదర్శంగా తీసుకుంటున్నాం. మీ వారసత్వాన్ని కొనసాగిస్తాం’అని అనటంతో స్పీకర్‌ సహా సభ్యులు గొల్లుమన్నారు.   
చదవండి: నా పాత్రను పోషించనివ్వడం లేదు

మరిన్ని వార్తలు