ఈ తరంలో పుట్టడం నా అదృష్టం: మిస్‌ ఇండియా ఎర్త్‌

6 Mar, 2021 09:29 IST|Sakshi

భేష్‌.. లేడీ ఆఫీసర్స్‌

వజ్ర సంకల్పానికి మీరు నిలువెత్తు నిదర్శనం 

కరోనా సమయంలో మీ సేవలు అసమానం మహిళా దినోత్సవ వేడుకల్లో సీపీ 

సనత్‌నగర్‌: వజ్ర సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం మహిళా పోలీసు అధికారులని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ కొనియాడారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో మహిళా పోలీసు అధికారులు విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని స్ఫూర్తిగా నిలిచారన్నారు. ‘షీ’టీమ్, హైదరాబాద్‌ పోలీసు సంయుక్తంగా బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లోని ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను రెండు రోజుల ముందుగానే  శుక్రవారం నిర్వహించారు. 

ఈ వేడుకలకు హాజరైన అంజనీకుమార్‌ మాట్లాడుతూ మహిళా శక్తి సామర్థ్యాలను సమాజానికి తెలియపర్చాలనే ఉద్దేశ్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రెండు రోజులు ముందుగానే నిర్వహించడం జరిగిందన్నారు. మహిళలు సహనానికి ప్రతీకగా అభివర్ణించారు. ఆర్మీ, నేవీ, పారామిలటరీ, పోలీసు వంటి విభాగాల్లో ప్రత్యేక యూనిఫాం వేసుకుని మహిళలు తమ సేవలను అందించడం గర్వకారణమన్నారు. నగర పోలీసు విభాగంలో 33 శాతం మంది మహిళలు ఉన్నారన్నారు. సిటీ పోలీసు కమిషనరేట్‌తో పాటు హెడ్‌ క్వార్టర్స్‌కు మహిళా పోలీసులు భద్రతగా నిలుస్తున్నారన్నారు. మహిళా పోలీసు అధికారులు అందించే ఈ రకమైన సేవలు దేశంలో మరే ఇతర నగరాల్లోనూ లేవన్నారు. షీ టీమ్స్, భరోసా సెంటర్, ఐటీ సెల్‌ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయన్నారు.
 
నగరంలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో మహిళా పోలీసు అధికారుల కోసం ప్రత్యేకమైన విశ్రాంతి గదులు, వాష్‌రూమ్‌లు, ఛేంజింగ్‌ గదులను కేటాయించామన్నారు. 2020 ఏడాది పోలీసు అధికారులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారని, ఎందరో పోలీసు అధికారులు కరోనా బారిన పడ్డారన్నారు. అందులో మహిళా అధికారులు కూడా ఉన్నారన్నారు. కరోనా బారిన పడినప్పటికీ 14 రోజుల క్వారంటైన్‌లో ఉండి ఆ వెనువెంటనే విధుల్లోకి చేరడం వారి అంకితభావానికి నిదర్శనంగా నిలిచిందన్నారు. మహిళా పోలీసు అధికారులైతే ఇంట్లో చిన్న పిల్లలు, పెద్దలు ఉన్నప్పటికీ కరోనా సమయంలో ఏమాత్రం వెరవకుండా అర్ధరాత్రి సైతం సేవలు అందించారని, వారందరికీ నా సెల్యూట్‌ అన్నారు. మార్చి 8 ఒక్కరోజు మాత్రమే కాదని, ప్రతిరోజూ మహిళా దినోత్సవమేనన్నారు. మహిళలను గౌరవించడం ప్రధాన బాధ్యత అన్నారు. 

ప్రత్యేక అతిథిగా హాజరైన మిస్‌ ఇండియా ఎర్త్, ఆల్‌ ఇండియాస్‌ బెస్ట్‌ క్యాడెట్‌ డాక్టర్‌ తేజస్విని మనోజ్ఞ మాట్లాడుతూ తాను ఈ తరంలో జన్మించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నిరంతరం ప్రజాభద్రత, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్న పోలీసులు అధికారులకు ఆమె సెల్యూట్‌ చేశారు. ‘ఆడ పిల్లగా పుట్టినందుకు మనమందరంగా గర్వపడదాం..మార్పు కోసం ప్రయత్నిద్దాం..దేశం కోసం పాటుపడదామని’ ఈ సందర్భంగా ఆమె నినదించారు. కార్యక్రమంలో ఆదాయపన్ను శాఖ చీఫ్‌ కమిషనర్, నగర పోలీసు కమిషనర్‌ సతీమణి వసుంధర సిన్హా, ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ అనిల్‌కుమార్, పోలీసు అదనపు కమిషనర్లు డీఎస్‌ చౌహాన్, జాయింట్‌ కమిషనర్‌(ఎస్‌బీ) తరుణ్‌ జోషి, నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌ సింగనవర్, శిరీష తదితరులు పాల్గొన్నారు.  

చదవండి: ‘అమ్మా నన్ను కన్నందుకు’.. మేడమ్‌ మీవల్లే

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు