‘మిస్‌ ఇండియా’ కిరీటం.. విన్నర్‌గా తెలుగమ్మాయి

13 Feb, 2021 19:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘పుట్టుకతో వచ్చినది కాదు మనల్ని మనం సరికొత్తగా ఆవిష్కరించుకోవడంలో అందం ప్రతిఫలిస్తుంది’ అని నిరూపిస్తోంది మానస వారణాసి. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన మానస విఎల్‌సిసి ఫెమినా మిస్‌ ఇండియా 2020 పోటీలో గెలిచి తన సత్తా చాటింది. ఇప్పుడీ తెలుగు అమ్మాయి పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ముంబయ్‌ హయ్యత్‌ రిజెన్సీలో బుధవారం జరిగిన విఎల్‌సిసి ఫెమినా మిస్‌ ఇండియా 2020 వేడుకలో తెలంగాణ అమ్మాయి మానస వారణాసి మొదటి స్థానం లో నిలిచి అందాల కిరీటం గెలుచుకోగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాన్యా సింగ్‌ రన్నరప్‌గా, హర్యానాకు చెందిన మనికా షియోకండ్‌ ఫెమినా మిస్‌ గ్రాండ్‌ ఇండియా కిరీటం దక్కించుకున్నారు. 23 ఏళ్ల మానస హైదరాబాద్‌లోని గ్లోబల్‌ ఇండియన్‌ లో స్కూల్‌ చదువు, వాసవి ఇంజినీరింగ్‌ కాలేజీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ పూర్తి చేసింది. ఇంజనీరింగ్‌ చేసిన మానస ఫైనాన్షియల్‌ ఇన్ఫర్మేషన్‌ ఎక్స్‌ఛేంజ్‌ అనలిస్ట్‌గా పనిచేస్తోంది.

నిత్య సాధనం... నిత్య వినూత్నం
సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుకుగా ఉండే మానస తన ప్రాక్టీస్‌ను నిత్యం కొనసాగిస్తూ, ఆ అనుభవాలను పంచుకుంటూనే ఉంటుంది. ‘సాధన చేస్తూ ఉంటే జీవితం ఏం ఇస్తుందో ఎవరూ చెప్పరు. రాయడం, చిత్రలేఖనం, పరిగెత్తడం, పాడటం వంటివి మాత్రమే కాదు స్నేహితులను ఎలా సంపాదించుకోవాలో కూడా సాధన చేయాలి. మంచి ఫ్రెండ్‌గా, మంచి తోబుట్టువుగా, మంచి వ్యక్తిగా ఎలా ఉండాలో కూడా సాధన చేయాలి. ప్రజలు దానిని గుర్తించేంత వరకు సాధన ఆపకూడదు. అవసరమైన చోట కోపం చూపడం, అవసరమైన వారికి దయను ఎలా అందించాలో కూడా నేర్చుకోవాలి. ఇవన్నీ మనల్ని శక్తింతులను చేసేవే, ఇవే మరిన్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతాయని నేను గ్రహించాను’ అని చెప్పారామె.

A post shared by Femina Miss India (@missindiaorg)

కళల కసరత్తు
ఇంజినీరింగ్‌ చదువు పూర్తి కాగానే మానస ఎఫ్‌బిబి–ఇండియా ఫ్యాషన్‌ హబ్‌ కలర్స్‌ టివి ఫెమినా మిస్‌ ఇండియా 2019 తెలంగాణ ఫైనలిస్ట్‌గా ఎంపికయ్యారు. ఫెమినా మిస్‌ ఇండియా పోటీలో గెలుపొందిన ఈ అందాల రాశి కసరత్తులు చేయడంతో పాటు రాయడం, చదవడం, సంగీతం, యోగా, భరతనాట్యంలోనూ రాణిస్తోంది. కొత్తవాటిని తెలుసుకోవాలనే ఉత్సుకత ఎన్నింటినో నేర్పుతుంది. మనల్ని బలవంతుల్ని చేస్తుంది అని నమ్ముతుంది. ఎప్పుడూ ఓ కొత్త కళను సాధన చేయడంలో బిజీగా ఉండే మానస ‘నా చిన్నతనంలో చాలా సిగ్గుగా, నలుగురిలోకి వెళ్లాలన్నా భయంగా ఉండేదాన్ని. టీనేజ్‌లో ఏదో తెలియని ఒక ఆరాటం, ఎప్పుడూ నాకు సౌకర్యంగా అనిపించిన ప్లేస్‌లోనే ఉండిపోవడానికి ప్రయత్నించేదాన్ని.

A post shared by Femina Miss India (@missindiaorg)

కాస్త పెద్దయ్యాక ప్రతిరోజూ నన్ను నేను ప్రశ్నించుకుంటూ, మెరుగుపరుచుకోవడం మొదలయ్యింది. ఇప్పటికీ ఈ అలవాటును కొనసాగిస్తూనే ఉన్నాను. దీనివల్ల ప్రతియేటా నన్ను మరింత శక్తిమంతురాలిగా ఈ లోకం ముందు నిలబెడుతుంది’ అంటూ తన ఆలోచనలు పంచుకుంటారు ఆమె. ఈ అందాల రాశి ఒక స్వచ్ఛంద సంస్థలో చేరి, పిల్లలకు విద్యాబోధన కూడా చేసింది. పిల్లలతో ఉండడం వల్ల, వారి చిరునవ్వుల నుంచి ఎంతో నేర్చుకోవచ్చని, ఎంతో సంతోషాన్ని పంచుకోవచ్చని అంటుంది మానస. కళలపై ఉన్న అభిరుచి, సాధన ఈ రోజు ఆమెకు కిరీటాన్ని తెచ్చిపెట్టాయి. మానస వారణాసి మరిన్ని విజయశిఖరాలను అధిరోహించాలని తెలుగువారి అభిలాష, అకాంక్ష. 

మరిన్ని వార్తలు