ఆ అన్న కళ్లలో అమితానందం. ఒకటా రెండా.. 17 ఏళ్ల తర్వాత..

23 Nov, 2021 21:02 IST|Sakshi
పదిహేడేళ్ల తర్వాత కలిసిన అన్నాచెల్లెలి ఆనందం

 మతిస్థిమితం కోల్పోయి

17 ఏళ్ల తర్వాత కలిసిన అనుబంధం

అక్కున చేర్చుకుని ఆదరించి.. అప్పగించిన అన్నం ఫౌండేషన్‌

సాక్షి, ఖమ్మం : ఆ అన్న కళ్లలో అమితానందం. ఒకటా రెండా.. 17 ఏళ్ల తర్వాత తన సోదరిని చూసిన ఆ క్షణాన.. ఒక్కసారిగా ఉబికి వచ్చిన దుఃఖం, అంతకు మించిన సంబరం కలగలిసిన ఉద్విగ్న తరుణమిది. 2004లో మతిస్థిమితం కోల్పోయి. .ఐదేళ్ల క్రితం గార్లలో రోడ్ల వెంట దీన స్థితిలో ఉన్న ఓ మహిళను ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్‌కు తరలించి నిర్వాహకులు ఆశ్రయం కల్పించారు. వైద్యపరీక్షలు చేయించి, బాగోగులు చూసుకోవడంతో క్రమంగా ఆరోగ్యం కుదుటపడి ఇటీవల తన వివరాలు తెలిపింది. తన పేరు వల్లాల భాగ్య అని, ప్రస్తుత హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామమని వివరించింది.
చదవండి: ఫేస్‌బుక్‌ లైవ్‌: ‘సిరిసిల్ల టౌన్‌ సీఐ వేధిస్తున్నాడు.. విషం తాగి చనిపోతున్నా’

ఈ క్రమంలో అన్నం ఫౌండేషన్‌ అధ్యక్షుడు అన్నం శ్రీనివాసరావు సోమవారం ఆమెను తీసుకెళ్లి పోలీసులు, వంగర సర్పంచ్‌ సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులు లచ్చవ్వ, రామస్వామి గౌడ్, మరో అన్న చనిపోగా.. సోదరులు వీరస్వామి, తిరుపతికి అప్పగించడంతో పాటు ఫౌండేషన్‌ తరఫున రూ.5వేలు అందజేశారు. ఈమెకు ఒక కుమారుడు ఉండగా.. ఇప్పుడు ముంబైలో ఉద్యోగం చేస్తున్నాడని వారు చెప్పారు. అప్పట్ల భాగ్య దివంగత ప్రధాని పీవీ.నర్సింహారావు ఇంట్లో కూడా పనిచేసిందని వాళ్లు గుర్తు చేశారు.
చదవండి: కారణం ఏదైనా వారే టార్గెట్‌: కిడ్నాప్‌లు.. హత్యలు.. లైంగిక దాడులు 

భర్తతో గొడవల కారణంగా మానసికంగా కుంగిపోయి.. మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి పోయిందని అన్నారు. ఎటు వెళ్లిందో, అసలు ఉందో, చనిపోయిందో తెలియక కుమిలిపోతున్నామని చెప్పారు. అలాంటిది..ఇన్నాళ్ల తర్వాత తిరిగొచ్చిన చెల్లెల్లికి ఇకపై ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటామని వారు తెలిపారు. తమకు చెల్లెలిని అప్పగించిన అన్నం శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఫౌండేషన్‌ సభ్యుడు దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు