పదేళ్ల క్రితం అదృశ్యం: పుట్టింటికి రప్పించిన రాఖీ పండుగ

29 Aug, 2021 08:33 IST|Sakshi
తమ్ముడు పవన్‌కు రాఖీ కడుతున్న రజిత

సాక్షి,నెన్నెల(ఆదిలాబాద్‌): అక్కాతమ్ముడు..అన్నాచెల్లెల అనుబంధానికి ప్రతీక రాఖీ. అనుబంధమే పదేళ్ల తర్వాత అక్కాతమ్ముడిని మళ్లీ కలిపింది. కుటుంబానికి దగ్గర చేసింది. చనిపోయిందేమో.. అనుకున్న మహిళ శనివారం తిరిగి రావడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని బోయవాడకు చెందిన టేకులపల్లి వెంకటి, మధునక్క దంపతులకు కుమారులు శ్రీనివాస్, పవన్, కూతురు రజిత ఉన్నారు. కూలీ పనులు చేస్తూ పిల్లలను పోషిస్తుండేవారు.

ఈ ప్రాంతం నుంచి కూలీలు కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో వ్యవసాయ పనులు చేయడానికి వలస వెళ్తుంటారు. అలా పనుల కోసం పదేళ్ల క్రితం వెళ్లిన రజిత తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికినా ప్రయోజనం లేకపోయింది. కాగా, జమ్మికుంటలో మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా హనీగావుకు చెందిన రాజు అనే యువకుడు రజితకు పరిచయమయ్యాడు. అతడితో కలిసి ఆమె వాళ్ల ఇంటికి వెళ్లింది. అక్క డే రాజును పెళ్లి చేసుకుంది. ఈ విషయం తల్లి దండ్రులకు తెలిస్తే కొడతారనే భయంతో ఇంతకాలం నెన్నెలకు రాలేదు.

రజిత ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కూడా చనిపోయిందేమోనని భావించారు. రెండేళ్ల క్రితం ఆమె అన్న శ్రీనివాస్‌ చనిపోయినా సమాచారం తెలియకపోవడంతో రాలేదు. ఇటీవల రాఖీ పండుగకు రజిత భర్త రాజుకు రాఖీ కట్టేందుకు అతడి చెల్లెళ్లు రావడం, రాఖీ కట్టడం తన తమ్ముడిని, కుటుంబాన్ని గుర్తు చేసింది. ‘‘మా ఆయనకు రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెళ్లను చూసి నాకు నా తమ్ముడు పవన్‌ గుర్తుకు వచ్చాడు.

వాడికి రాఖీ కడతానని మూడు రోజుల క్రితం నాందేడ్‌ నుంచి బయలుదేరి శనివారం మధ్యాహ్నం నెన్నెలకు వచ్చాను.. నాకు ప్రస్తుతం ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. పదేళ్ల తర్వాత మా అమ్మానాన్నలు, నా కుటుంబ సభ్యులను కలవడం ఎంతో ఆనందంగా ఉంది..’’ అంటూ ఆనందభాష్పాలు రాల్చింది. మహారాష్ట్రలో జీవనంతో ఆమె కట్టు, బొట్టు మారింది. మరాఠీ, హిందీ భాషా మాట్లాడుతోంది. ఆమెను చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. శనివారం తమ్ముడు పవన్‌కు రాఖీ కట్టింది. అన్నను గుర్తు చేసుకుంటూ విలపించింది.  

చదవండి: సంప్రదాయ భోజనంపై దుష్ప్రచారమా?

మరిన్ని వార్తలు