‘మిషన్‌’ఇన్‌కంప్లీట్‌!

3 Jan, 2021 09:00 IST|Sakshi

నిధుల కొరతతో మిషన్‌ కాకతీయలో నిలిచిన పనులు 

5,553: పనులు పెండింగ్‌లో ఉన్న చెరువులు

చివరి రెండు విడతల్లో ఈ సమస్య 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పల్లెకు ఆయువుపట్టు చెరువు. ఆ చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించి చేపట్టిన మిషన్‌ కాకతీయ మొదట్లో ఒక ఉద్యమంలా సాగినా... చివరకు వచ్చేసరికి నిధుల కొరతతో నీరసించింది. మొదటి రెండు విడతలుగా చేపట్టిన పనులు ఉధృతంగా సాగగా, చివరి రెండు విడతల పనులు పూర్తిగా చతికిలబడ్డాయి. ప్రభుత్వం నుంచి సమగ్రంగా నిధుల కేటాయింపు లేకపోవడం, పెండింగ్‌ బిల్లుల నేపథ్యంలో 5 వేలకు పైగా చెరువుల పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. 22 వేల చెరువులకు తిరిగి జీవం పోసినా... ఆఖర్లో ప్రభుత్వం నుంచి మునుపటి చొరవ లేకపోవడంతో మిగిలిపోయిన 5 వేల చెరువుల పనులను ఎలా పూర్తిచేయాలో ఇరిగేషన్‌ శాఖకు పాలుపోవడం లేదు.  

బిల్లుల బకాయిలు500కోట్లు 
రాష్ట్రంలో నాలుగు విడతలుగా చేపట్టిన మిషన్‌ కాకతీయ కార్యక్రమం కింద 27,625 చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయించగా, అందులో 26,989 చెరువుల పనులు ఆరంభించారు. ఇప్పటి వరకు 22 వేల చెరువుల పనులు పూర్తయ్యాయి. మూడో దశలో 5,958 పనులు చేపట్టగా 2,040 చెరువుల పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. వీటిని రెండేళ్ల కిందట జూన్‌ నాటికే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టినా అవి ముందుకు సాగడం లేదు. ఇక 4వ విడతలో 4,214 చెరువుల పనుల్లో మరో 2,472 పనులు పూర్తి కాలేదు. ఇలా నాలుగు విడతల్లో కలిపి మొత్తం 5,553 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. భారీ ప్రాజెక్టుల అవసరాలకే నిధుల మళ్లింపు జరగడంతో ఈ పనులకు అనుకున్న మేర నిధుల ఖర్చు జరగలేదు. దీంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. బిల్లుల చెల్లింపుపై ఆర్థిక శాఖకు పదేపదే విన్నవిస్తున్నా, అరకొర నిధులను విదిల్చి చేతులు దులుపుకుంటోంది. దీంతో ఇటీవలే కల్పించుకున్న ఇరిగేషన్‌ శాఖ రూ.25 లక్షల కన్నా తక్కువ బిల్లులున్న వాటికి నిధులు ఇప్పించడంలో చొరవ చూపడంతో 260 చెరువులకు సంబంధించిన బిల్లులు చెల్లించారు. అయినప్పటికీ మరో రూ.500 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఈ పనులు ఎప్పటికి పూర్తవుతాయన్న దానిపై స్పష్టత లేదు. 

ఇరిగేషన్‌ పునర్‌ వ్యవస్థీకరణతో వీటిపై దృష్టి పెట్టేదెపుడో? 
ఇక శాఖ పునర్‌వ్యవస్థీకరణతో మైనర్‌ ఇరిగేషన్‌ విభాగం పూర్తిగా రద్దయింది. అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తేవడంతో మైనర్‌ ఆయా డివిజన్‌ల సీఈల పర్యవేక్షణలోకి వెళ్లింది. ఈ పునర్‌వ్యవస్థీకరణ మేరకు చెరువుల ఒప్పందాల పైళ్ల విభజన, పని విభజన జరగాల్సి ఉంది. అనంతరం డివిజన్‌ల వారీగా వీటి పురోగతిని సీఈలు పరిశీలించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చెక్‌డ్యామ్‌ల టెండర్లు, వాటి ఒప్పందాలు, పనుల కొనసాగింపు ప్రక్రియ జరుగుతోంది. ఈ తరుణంలో పెండింగ్‌ చెరువుల పనులపై వీరెంత దృష్టి సారిస్తారన్నది చూడాలి.

మరిన్ని వార్తలు