మిస్టర్‌ తెలంగాణగా ఎంపికైన సింగరేణి బిడ్డ

23 Aug, 2021 08:52 IST|Sakshi

సాక్షి, గోదావరిఖని(ఆదిలాబాద్‌): జాతీయస్థాయిలో జరిగిన మిస్టర్‌ అండ్‌ మిస్‌ ఇండియా అందాల పోటీల్లో మిస్టర్‌ తెలంగాణ టైటిల్‌ సాధించి సింగరేణి కార్మికుడి బిడ్డ సత్తా చాటాడు. జాతీయస్థాయి అందాల పోటీలు ఈనెల 1 నుంచి 5 వరకు ఢిల్లీలోని ఆగ్రాలో జరిగాయి. ఈ పోటీల్లో సింగరేణి కార్మికుడి కుమారుడు రేణికుంట చరణ్‌ మిస్టర్‌ తెలంగాణా టైటిల్‌ సాధించాడు. ఆగ్రాలో జరిగిన ఈ పోటీల్లో ఫైనల్‌కు చేరుకుని బెస్ట్‌ఫైవ్‌లో నిలిచి మిస్టర్‌ తెలంగాణా టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. ఆర్జీ–3 ఏరియా ఓసీపీ–1లో ఈపీ ఆపరేటర్‌గా పనిచేస్తూ యైటింక్లయిన్‌కాలనీలో ఉంటున్న రేణికుంట శ్రీనివాస్‌ కుమారుడు రేణికుంట మారుతిచరణ్‌ సికింద్రాబాద్‌ సర్ధార్‌పటేల్‌ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

గతంలో అండర్‌–19 రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీల్లో పాల్గొన్నాడు. అనంతరం మోడలింగ్‌వైపు దృష్టి సారించాడు. ఈ క్రమంలో మిస్టర్‌ ఇండియా అందాల పోటీలో పాల్గొని మిస్టర్‌ తెలంగాణా టైటిల్‌కు ఎంపికయ్యాడు. స్టార్‌లైఫ్‌ ప్రొడక్షన్‌ ఆధ్వర్యంలో ఈనెల 1 నుంచి 5 వరకు ఢిల్లీలో మిస్టర్‌అండ్‌మిస్‌ ఇండియా పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో అన్ని రాష్ట్రాలకు చెందిన 60 మంది పాల్గొనగా, మిస్టర్‌ ఇండియా టాప్‌ఫైవ్‌ ఫైనల్‌ లిస్ట్‌కు చేరుకున్నాడు. దీంతోపాటు మిస్టర్‌ తెలంగాణా టైటిల్‌ సాధించాడు. ఈ పోటీల తర్వాత ఇండియా కల్ట్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్‌ వీక్‌ పాల్గొనేందుకు ఆహ్వానం అందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  

సినిమాల్లో నటించాలని ఉంది 
భవిష్యత్‌లో సినిమాల్లో నటించాలని ఉంది. యాడ్‌షూట్‌లో బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిలవాలని ఉంది. గతంలో రాష్ట్రస్థాయి మిస్టర్‌అండ్‌మిస్‌ హైదరాబాద్‌ పోటీల్లో పాల్గొని మిస్టర్‌ ఫోటోజెనిక్‌ హైదరాబాద్‌ టైటిట్‌ సాధించా. మిస్టర్‌ అండ్‌మిస్‌ ఏషియా సెమిఫైనల్స్‌ జూన్‌నెలలో జరగ్గా అందులో పాల్గొని ఫైనల్స్‌ చేరుకున్నా. మిస్టర్‌అండ్‌మిస్‌ బాలీవుడ్‌ హైదరాబాద్‌లో జరిగిన పోటీల్లో సెమిఫైనల్స్‌ అర్హత సాధించా. సెమిఫైనల్‌ పోటీలు జరగాల్సి ఉన్నాయి.     

– రేణికుంట చరణ్, టైటిల్‌ విజేత  

చదవండి: AP: అరుదైన ఆలయం.. భారతమాతకు వందనం 

మరిన్ని వార్తలు