సాక్షి పరిశోధన: పెట్టుబడి సాయం.. గుట్టుగా మాయం

28 Jun, 2021 16:24 IST|Sakshi

రాష్ట్రంలో రైతుబంధు నిధులు కాజేస్తున్న అక్రమార్కులు

ఎప్పుడో ప్రాజెక్టు కింద మునిగిపోయిన  భూములు

ఇప్పటికీ రైతుల పేర్లపైనే ఉన్న తీరు

ఎస్సారెస్పీ ముంపు భూములకు పాస్‌ పుస్తకాలు సృష్టించి సాయం పొందుతున్న వైనం

ఒక్క బాసర మండలంలోనే 2,863 ఎకరాల భూములకు రైతుబంధు  

ఏళ్ల క్రితం ఏర్పడిన కాలనీలు, ‘రియల్‌’వెంచర్ల భూములకు కూడా.. 

వ్యవసాయ యోగ్యం కాని గుట్టలు, చెరువులకు సైతం 

రైతన్నలు అప్పుల ఊబిలో కూరుకుపోరాదనే సదుద్దేశంతో 2018 నుంచి వ్యవసాయ ప్రారంభ పెట్టుబడి అందజేస్తున్న ప్రభుత్వం  

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ (గడ్డం రాజిరెడ్డి): ఇది శ్రీ రాంసాగర్‌ ముంపు ప్రాంతం. ఇలా ముంపులో ఉన్న భూములకూ రైతు బంధు సాయం అందుతుండటం విస్మయం కలిగిస్తోంది. పూర్వ నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఎప్పుడో 30 ఏళ్ల క్రితం శ్రీరాంసాగర్‌ నిర్మాణానికి ఈ భూమిని సేకరించారు. ఈ భూములకు రైతుల పేర్లను తీసివేసి అధికారులు మ్యుటేషన్‌ ద్వారా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ భూములుగా మార్చాల్సి ఉంది. కానీ ఇప్పటికీ వందలాది ఎకరాలు రైతుల పేర్లపైనే ఉన్నాయి. అంతేకాదు రెవెన్యూ, వ్యవసాయ శాఖలు ఇలాంటి భూములను రైతుబంధు పథకం నుంచి తొలగించి నిధులు దుర్వినియోగం కాకుండా చూడాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోలేదు. దీంతో కొందరు.. రైతుల పేరిట ఈ ప్రాజెక్టు ముంపు భూములకు పెట్టుబడి సాయం పొందుతున్నారు. ఒక్క బాసర మండలంలోనే 2,863 ఎకరాల భూములకు రైతుబంధు అందినట్లు రికార్డులు చెబుతున్నాయి. నిర్మల్, నిజామాబాద్, నందిపేట, బాల్కొండ తదితర మండలాల్లోనూ శ్రీరాంసాగర్‌ ముంపు గ్రామాలు ఉన్నాయి. కొందరు అక్రమంగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు సృష్టించి రైతుబంధు పొందుతున్నారనే ఆరోపణలున్నాయి.

 రైతుబంధు కింద తొలిసారి 2018 వానాకాలం (ఖరీఫ్‌) సీజన్‌లో ఎకరానికి రూ.4 వేలు ఇచ్చిన ప్రభుత్వం, 2019 వానాకాలం నుంచి ఎకరానికి రూ. 5 వేలు చొప్పున రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. 

 ఈ పథకం కింద అత్యధికంగా నల్లగొండ జిల్లాలో ఎక్కువ మంది రైతులు (4,72,983) లబ్ధి పొందుతుండగా, మేడ్చల్‌ – మల్కాజ్‌గిరి జిల్లాలో అతి తక్కువ మందికి (39,762) పెట్టుబడి సాయం అందుతోంది. 

సాగు భూమి ఉన్న ప్రతి రైతుకూ గరిష్ట పరిమితి లేకుండా అమలు చేస్తున్న పథకం మంచిదే అయినా.. వ్యవసాయ భూములేవో, ఇతర భూములేవో పరిశీలించకుండా పాస్‌ పుస్తకాలున్న ప్రతి ఒక్కరికీ పెట్టుబడి సాయం ఇస్తుండటంతో పెద్దమొత్తంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి.  

 కాలనీ భూమికీ ‘బంధు’వే
ఏళ్ల క్రితం ఏర్పడిన ఓ కాలనీ భూమికీ రైతు బంధు నిధులు అందుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన భూమి పేరిట ఆ గ్రామానికి చెందిన కంచర్ల మనోహరమ్మ ఇప్పటివరకు 6 పర్యాయాలు పెట్టుబడి సాయం పొందింది. సుమారు 50 ఏళ్ల క్రితం కంచర్ల మల్లారెడ్డి 163/1 సర్వే నంబర్‌లోని 3.39 ఎకరాల భూమిని ఎస్సీ కాలనీ కోసం ఇచ్చాడు. అతనికి ప్రభుత్వం డబ్బులు చెల్లించింది. అయితే ఈ భూమి రికార్డులో మల్లారెడ్డి పేరును అధికారులు తొలగించలేదు.

దీంతో 2018 వరకు మల్లారెడ్డి పేరిటే రికార్డులో ఉంది. తర్వాత ఆయన కుమారుడు అశోక్‌రెడ్డి తన తండ్రి పేరు స్థానంలో తల్లి మనోహరమ్మ పేరు చేర్పించి రెవెన్యూ అధికారులను ప్రలోభపెట్టి కాలనీగా ఉన్న భూమికి పట్టా చేయించాడు. దీంతో అప్పటినుంచి రైతుబంధు నిధులు మనోహరమ్మ ఖాతాలో జమ అవుతున్నాయి. దీనిపై మనోహరమ్మ పాలి వారైన కంచర్ల మహేందర్‌రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్‌ 12న జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆరో విడత రైతుబంధు మనోహరమ్మ పొందడం గమనార్హం.  ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, కలెక్టరేట్‌కు నివేదిక పంపామని తహసీల్దార్‌ షేక్‌ అహ్మద్‌ చెప్పారు.

దత్తప్పగూడెం ఎస్సీ కాలనీ   

ఇవే కాదు.. వ్యవసాయ భూముల్లో ఏళ్ల క్రితమే కాలనీలుగా ఏర్పడినా, అప్పట్లో ఎవరైతే రైతులు భూమిని విక్రయించారో అదే రైతుల ఖాతాల్లోకి కూడా నగదు వెళ్తోంది. అదే విధంగా వ్యవసాయ యోగ్యం కాని గుట్టలు, చెరువులకు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు (పట్టాభూములుగా చూపినవాటికి) సైతం రైతుబంధు అందుతోందని ‘సాక్షి’పరిశీలనలో తేలింది. కళాశాలలు, ఫంక్షన్‌ హాళ్లకు కూడా చాలాచోట్ల పెట్టుబడి సాయం అందుతోందనే ఆరోపణలున్నాయి.  

పొలం ఉన్నా, పెట్టుబడి డబ్బులు లేక ఎప్పటికప్పుడు అధిక వడ్డీకి అప్పులు తెచ్చి సాగు చేస్తూ.. కాలం కలిసి రాక రుణాల ఊబిలో చిక్కుకుపోతున్న రైతన్నలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘రైతుబంధు’పథకం ప్రవేశపెట్టింది. తొలిసారిగా 2018 – 19 ఖరీఫ్‌ సీజన్‌ నుండి, ఈ వ్యవసాయ ప్రారంభ పెట్టుబడి సహాయ పథకం అమలు చేస్తోంది. అప్పట్నుంచీ ప్రతి సీజన్‌లో ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం రైతుల జాబితాలను తయారు చేస్తున్న వ్యవసాయ శాఖ వారి ఖాతాల్లో సొమ్ము జమ చేస్తోంది. 2018 నుంచి 2021 జూన్‌ వరకు ఏడు పంట సీజన్లకు మొత్తం రూ.46,186.67 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.

2018 – 19లో రూ.12 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. గత యాసంగిలో 59,25,725 మంది రైతుల ఖాతాల్లో రూ.7,400 కోట్లను జమ చేసింది. ఈ ఏడాది (2021 – 22)లో వానాకాలం, యాసంగి (రబీ) సీజన్లలో కలిపి మొత్తం రూ.14,800 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి 63.25 లక్షల మంది రైతులకు 150.18 లక్షల ఎకరాలకు గాను రూ.7,508.78 కోట్లు (జూన్‌ 15 నుంచి 25 వరకు) జమ చేసింది. అయితే వీటిల్లో కోట్ల రూపాయల నిధులు.. అక్రమార్కులు కొట్టేస్తున్నారు. రైతుబంధుపై సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నా దిద్దుబాటు జరగక పోవడం శోచనీయం.

ఇష్టారాజ్యంగా పాస్‌ పుస్తకాలు 
రైతుబంధు పథకాన్ని అందివచ్చిన అవకాశంగా మార్చుకున్న అధికారులు దీన్ని అమలు చేసే క్రమంలో చాలాచోట్ల ఇష్టారాజ్యంగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. షెడ్యూల్డ్‌ ఏరియాలో గిరిజనులకు రక్షణ కవచం లాంటి చట్టాన్ని కూడా కొన్నిచోట్ల తుంగలో తొక్కారు.  పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీ చేసి యాజమాన్య హక్కులు కల్పించారు. కొన్నిచోట్ల ప్రభుత్వ భూములకు యాజమాన్య హక్కులు కట్టబెట్టారు. కొత్తగా ఓ పట్టాదారు పాస్‌ పుస్తకం జారీ చేస్తున్నామంటే ఆ భూమికి సంబంధించిన పూర్తి దస్త్రాల నివేదికను కింది స్థాయి అధికారులు ఇవ్వాలి.

ముఖ్యంగా 1/70 (అటవీ హక్కుల చట్టం) ఉన్న ప్రాంతంలో ఆర్‌ఓఆర్, టైటిల్‌ డీడ్‌లు వంటి పూర్తిస్థాయి దస్త్రాలు ఉండాలి. అలాంటి దస్త్రాలు ఉన్న భూములకే పుస్తకాలు ఇవ్వాలి. కానీ గిరిజనేతరులకు విక్రయించిన భూములకు కూడా యాజమాన్య హక్కులు కట్టబెట్టారు. మామూలు పరిస్థితుల్లో కూడా సర్వేయర్‌తో పాటు వీఆర్వో, ఆర్‌ఐలు సంబంధిత భూస్వరూపం, పట్టాదారుకు సంబంధించిన పూర్తి దస్త్రాలకు సంబంధించిన నివేదికకు అనుగుణంగానే పాస్‌ పుస్తకాలు జారీ చేయాలి. కానీ చాలాచోట్ల అధికారులు, సిబ్బంది కుమ్మౖMð్క ఇష్టారాజ్యంగా ఇచ్చేసి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలున్నాయి.

గుట్టల భూములకూ ఇచ్చారు.. 
వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ, ముస్తఫాపూర్‌ గ్రామాలలో సుమారు 700 ఎకరాలు గుట్టలను కలుపుకొని ఉంది. మహ్మద్‌ ఖాద్రి పేరిట ముస్తఫాపూర్‌లో సర్వే నంబర్లు 211, 216లో 500 ఎకరాలు ఉంటుంది. కొత్తకొండలో సుధీర్‌రెడ్డి పేరిట 564 సర్వే నంబర్‌లో 200 ఎకరాలు గుట్టలను కలుపుకునే ఉంది. రైతుబంధు ప్రారంభంలో ఈ మూడు సర్వేనంబర్లలో ఉన్న కొంతభూమికి పెట్టుబడి సాయం అందింది. ఈ క్రమంలో మొత్తం భూములకు పాసుబుక్కులు ఇచ్చి రైతుబంధు ఇవ్వాలని వారు దరఖాస్తు చేసుకున్నారు. అక్కడి తహసీల్దార్‌ ఇటీవల మొత్తానికీ రద్దు చేసి డిజిటల్‌ సైన్‌ పెండింగ్‌లో పెట్టారు.
 

వ్యవసాయేతర భూమిగా మార్చినా.. 
యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండలం, సైదాపురం గ్రామంలో సర్వే నంబర్లు 17, 18, 19, 20లో ఉన్న సుమారు 50 ఎకరాల వ్యవసాయ భూమిని 2015లో రెవెన్యూ శాఖ వ్యవసాయేతర భూమిగా మార్చింది. అప్పట్లోనే ఈ భూమిలో ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ వెంచర్‌ వేసి ప్లాట్ల విక్రయం జరిపింది. నాలా కనెక్షన్‌ కూడా మంజూరైంది. ఇలా ప్లాట్లు అయిన ఈ వెంచర్‌ను విచిత్రంగా వ్యవసాయ భూమిగా పేర్కొంటూ కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. ఈ భూములకు రైతుబంధు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
 

వెంచర్‌  భూములతో వంచన
వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్‌ శివారులో 419, 445, 446, 447, 453, 454, 465 సర్వే నంబర్లలోని 22 ఎకరాల్లో ఏర్పాటైన రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ ఇది. ఎకరం రూ.70 లక్షల నుంచి 80లక్షలకు కొనుగోలు చేసిన వ్యాపారులు గజాల చొప్పున విక్రయించారు. అయితే ఈ భూమికి రైతుబంధు పడుతుండటం వివాదాస్పదం అవుతోంది. అలాగే ధర్మసాగర్‌ మండలం పెండ్యాల శివారు 2 సర్వే నంబర్లలోని 12 ఎకరాల వెంచర్‌ భూమికీ పెట్టుబడి సాయం అందుతోంది. ఇక జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ శివారు శివునిపల్లి సమీపంలోని ఓ వెంచర్‌ 3 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. రవీందర్‌రెడ్డికి చెందిన సర్వే నంబర్‌ 510, 511, 512 లో ఉన్న ఈ భూమిని, మూడేళ్ల క్రితం స్టేషన్‌ ఘన్‌పూర్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు విక్రయించారు. దీనికీ రైతుబంధు పొందుతున్నారు.
 

అటవీ చట్టానికి తూట్లు
పూర్వ ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని ఆర్‌ కొత్తగూడెంలో ఓ దళారీతో చేతులు కలిపిన అధికారి అక్రమాలకు పాల్పడ్డారు. శ్రీనివాసపురం, గోగుబాక, రాళ్లగూడెం, సత్యనారాయణపురం, చినమిడిసిలేరు(జి), తేగడ(జడ్‌), వీరాపురం, జి.పి.పల్లి, చింతకుంట, లింగాల, చర్ల గ్రామాల్లోని భూములకు సంబంధించి 1/70 (అటవీ హక్కుల చట్టం)కు విరుద్ధంగా పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేశారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనుల భూమిని ఇతరులెవరికీ బదలాయించడానికి వీల్లేదు. కానీ తేగడ (జడ్‌)లో ఓ రైతుకు సంబంధించిన 10 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన ఇద్దరు వ్యక్తులకు యాజమాన్య హక్కులు కల్పించి పట్టాదారు పుస్తకాలు జారీ చేశారు. జి.పి.పల్లి (జడ్‌)లో ఓ వ్యక్తికి చెందిన 10.30 ఎకరాలను సబ్‌ డివిజన్లుగా మార్పు చేసి అనువంశికంగా వీలునామాలు సృష్టించి పట్టాదారు పుస్తకాలను జారీ చేశారు. రైతుబంధు అందేలా ఈ పుస్తకాల జారీకి సంబంధించి ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేయడం వివాదాస్పదం కావడంతో ఆ తర్వాత రద్దు చేశారు.  

నారాయణపురానికి నయాపైసా రాలే..
అక్రమాల్ని పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు పెట్టుబడి సాయం అందుతోంది. కానీ మహబూబాబాద్‌ జిల్లా నారాయణపురం గ్రామంలో మాత్రం రైతుబంధు ఇవ్వడం లేదు. ఊరిలో ఉన్న వెయ్యి మంది రైతుల్లో ఏ ఒక్క రైతుకూ సాయం అందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం 2017లో చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా అప్పట్లో చిన్న తండాలు, శివారు గ్రామాలుగా ఉన్న నారాయణపురం, పీకల తండా, క్యాంపు తండాలను నెల్లికుదురు మండలం చిన్నముప్పారం గ్రామం నుంచి వేరు చేసి కొత్తగా నారాయణపురం రెవెన్యూ విలేజ్‌గా మార్చారు. అనంతరం గ్రామాన్ని కేసముద్రం మండలంలో కలిపారు. దీంతో ఆ గ్రామ రైతుల తలరాతలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆ గ్రామంలోని 1,827 ఎకరాల భూమిని భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో అటవీ భూముల్లో కలిపేశారు. వాస్తవానికి 1952కు ముందు ఈ భూములు అటవీ శాఖ పరిధిలోనే ఉన్నాయి. కానీ 1952 తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం అటవీ శాఖ నుంచి వెనక్కు తీసుకుని రైతులకు పంపిణీ చేసింది.

అయితే రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంతో రికార్డులు మార్చలేదు. దీంతో అవి అటవీ శాఖకు చెందిన సర్వే నంబర్ల పైనే కొనసాగుతూ వచ్చాయి. ప్రక్షాళనలో ఆ భూముల్లో 1,605 ఎకరాలను రిజర్వ్‌ ఫారెస్టులో ఉన్న పట్టా భూములుగా, మరో 222 ఎకరాలు పట్టా భూమిగా సర్కారు గుర్తించింది. నారాయణపురం రెవెన్యూ గ్రామంగా మారి వేరొక మండలంలో కలవడంతో ఏర్పడిన గందరగోళం, అటవీ హక్కుల గుర్తింపు పత్రాలు (ఆర్వోఎఫ్‌ఆర్‌) పట్టాలు లేకపోవడంతో 1,605 ఎకరాలకు రైతుబంధు అందడం లేదు. దీంతో ఆ గ్రామ ప్రజలు పలుమార్లు అటవీ శాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆర్‌.శోభను, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను కలిసి వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేదు. అయితే భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో నారాయణపురం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ నిలిచిపోయిందని ఇటీవల ఫారెస్టు క్లియరెన్స్‌ రావడంతో, వీరికి పట్టాదారు పాస్‌ పుస్తకాలు అందించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని కేసముద్రం తహసీల్దార్‌ కోమల తెలిపారు. పహాణీల జాబితాను గ్రామ పంచాయతీలో ఇటీవల ప్రదర్శించామని, జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆరు సర్వే నంబర్లలో గల రైతుల భూముల్లో ఎంజాయ్‌మెంట్‌ సర్వేను ప్రారంభించామని వివరించారు. వారంలో ఈ సర్వే పూర్తి చేస్తామని, రైతులు వారి భూముల్లో ఉండి తమకు సహకరించాలని కోరారు. 

ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలున్నా.. 
మరోవైపు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలున్నా కొన్ని ప్రాంతాల్లో గిరిజన రైతులకు రైతుబంధు అందడం లేదు. రైతుబంధు కోసం ఎన్ని దరఖాస్తులు చేసుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఆదిలాబాద్‌ తదితర జిల్లాల్లో గిరిజనులు చాలా ఏండ్లుగా అటవీ భూములను సాగు చేసుకుంటున్నారు. వీరికి 2006లో అటవీ హక్కు చట్టం ప్రకారం హక్కు పత్రాలను అందజేశారు. అయితే ఇవింకా అధికారిక లెక్కల్లోకి ఎక్కకపోవడంతో ఉపయోగం లేకుండా పోయింది. రాష్ట్రంలో సుమారు 96 వేల మందికి అటవీ హక్కుల గుర్తింపు పత్రాల మేరకు పట్టాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలో ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ కింద ఉన్నా రైతుబంధు అందని రైతుల సాగు భూములు 

ముందే నమోదు కావడంతో రైతుబంధు 
కొన్నిచోట్ల నాలా (వ్యవసాయేతర భూమి) దరఖాస్తు కంటే ముందుగానే రైతుబంధు పథకంలో నమోదు కావడంతో నాలాగా కన్వర్షన్‌ అయినప్పటికీ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు రైతుబంధు డబ్బులు జమ అవుతోంది. వచ్చే ఏడాది ఇలాంటి భూములను ఆన్‌లైన్‌లో తొలగిస్తాం. అప్పటి నుంచి డబ్బులు రావు.  
–పి.శ్రీనివాస్, తహసీల్దార్, లింగాలఘణపురం, జనగామ జిల్లా
 

 

చదవండి: బీజేపీని రక్షించా.. మోత్కుపల్లి ఆసక్తికర వ్యాఖ్యలు
KTR: ఎక్కడున్నారో చెప్పుకోండి చూద్దాం..!

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు