కొండగట్టు శ్రీఆంజనేయస్వామి సన్నిధిలో వింత ఆచారం

22 Jun, 2021 07:19 IST|Sakshi

సాక్షి, కొండగట్టు(కరీంనగర్‌): కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయం తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. రోజూ వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. కోరిన కోర్కెలు తీరడంతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈసందర్భంగా ఆలయానికి పెద్దమొత్తంలో ఆదాయం సమకూరుతోంది. ఇలా వచ్చే నిధులను భక్తుల సౌకర్యాలు, వసతుల కల్పనకు వెచ్చించాల్సి న ఆలయ యంత్రాంగం.. వీఐపీలు, వీవీఐపీల సందర్శనల సందర్భంగా మొహమాటానికి వెళ్తోంది. ఆలయ నిబంధనల మేరకు శాలువాలతో ప్రముఖులను సత్కరించడం ఆనవాయితీ. కానీ, వారితో వచ్చే చిన్నాచితకా నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులను సైతం సన్మానిస్తోంది. ఇందుకోసం లెక్కకు మించి శాలువాలను వృథా చేస్తోంది.

ఏటా వందమందికిపైగా వీఐపీల రాక..
కొండగట్టులోని శ్రీ ఆంజనేయస్వామి దర్శనం కోసం ఏటా 100 మందికిపైగానే వీఐపీలు తరలివస్తుంటారు. వారు స్వామివారిని దర్శించుకుని వెళ్లంటారు.  ఈసమయంలో ఆలయ అధికారులు ప్రముఖులను శాలువాలు, కండువాలతో  సన్మానిస్తున్నారు. అయితే, స్వామివారి దర్శనం కోసం వచ్చే ప్రముఖులు ఒకరిద్దరు ఉంటే.. వారివెంట చిన్నాచితకా నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఒక్కోసారి అధికారులూ లెక్కకు మించి ఉంటున్నారు. కొందరి పర్యటనలో 25 మంది – 30 మంది వరకు ఉంటే.. మరికొందరి వెంట ఆ సంఖ్య రెట్టింపుకన్నా అధికంగానే ఉంటోంది. కరోనా సమయంలోనూ ఒకరిద్దరు రావాల్సి ఉండగా, పదుల సంఖ్యలో హాజరవడం విస్మయం కలిగించింది. ప్రముఖులు పూజలో కూర్చుండగానే వారి అనుయాయులూ అనుసరిస్తున్నారు. ఎంతైనా ప్రముఖులతోనే వచ్చారు కదా, వారిని కూడా సత్కరించకుంటే వీఐపీలు ఏమనుకుంటారోనని మొహమాటానికి గురవుతున్నారు అధికారులు. దీంతో ప్రముఖుల వెంట వచ్చిన అనధికారులను సైతం శాలువాలు, కండువాలతో సన్మానిస్తున్నారు.

క్యూలైన్లలో తాగునీటికి తిప్పలు..
అంజన్న దర్శనం కోసం క్యూలైన్లలో వెళ్తున్న భక్తులు తాగునీటి సౌకర్యంలేక తపిస్తున్నారు. అనధికారులకు వెచ్చిస్తున్న సొమ్ముతో క్యూలైన్లలో తాగునీటి సౌకర్యం కల్పిస్తే సమస్య పరిష్కారమవుతుందని కొందరు అధికారులు భావిస్తున్నా.. ఆ దిశగా చర్యలు తీసుకునే నాథుడే లేకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కో శాలువా ధర  రూ.25– రూ.200..
నాణ్యత, బ్రాండ్‌ను బట్టి ఒక్కో శాలువా రూ. 25–200 వరకు ధర ఉంటుంది. అయితే, కేవలం ప్రముఖులనే సన్మానిస్తే అంజన్న ఆలయంపై ఏటా సుమారు రూ.లక్ష వరకే ఉంటుందని అంచనా. కానీ, అనధికారులనూ సన్మానిస్తుండడంతో శాలువాలు, కండువాలు అధికంగా వినియోగించాల్సి వస్తోంది. తద్వారా అంజన్నపై ఏటా రూ.3లక్షల వరకు భారం పడుతోంది. ఇదంతా భక్తుల ద్వారా ఆలయానికి సమకూరిన సొమ్మే. దీనిని ఇష్టం వచ్చిన వారికి వెచ్చించడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. 

చదవండి: CM KCR: ‘టాలెస్ట్‌ టవర్‌ ఆఫ్‌ వరంగల్‌’గా ఆస్పత్రి 

మరిన్ని వార్తలు