వాహ్‌.. మొజంజాహీ

15 Aug, 2020 07:33 IST|Sakshi

ఎంజే మార్కెట్‌కు కొత్త సొబగులు  

రూ.15 కోట్లతో నూతన హంగులు 

నిర్మాణ కౌశలం దెబ్బతినకుండా పనులు 

అర్వింద్‌కుమార్‌ దత్తతతో నయా లుక్‌ 

నిర్మాణ ప్రత్యేకతలతో కాఫీ టేబుల్‌ బుక్‌ 

సాక్షి, సిటీబ్యూరో: గతంలో పెద్ద మార్కెట్‌గా ఎంతో ఘనతకెక్కి, కాలక్రమేణా శిథిలావస్థకు చేరిన మొజంజాహీ (ఎంజే) మార్కెట్‌ కొత్త సొబగులు అద్దుకుంది. నిర్వహణలోపంతో మసకబారిన చారిత్రక కట్టడానికి పునర్‌వైభవం కల్పించేందుకు మంత్రి కేటీఆర్‌ సూచన మేరకు ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌ కుమార్‌ దత్తత తీసుకున్నారు. రెండు మూడు నెలల్లోపే పనులు పూర్తి చేయవచ్చనుకున్నారు. దాదాపు రూ.3 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. కానీ వారసత్వ భవనానికి భంగం వాటిల్లకుండా.. గత నిర్మాణ కౌశలం దెబ్బతినకుండా జాగ్రత్తగా పనులు చేయడంతో సమయమూ, వ్యయమూ పెరిగాయి.

అయినా గత చరిత్రను కాపాడుతూ, పునర్‌వైభవ పనులను పూర్తిచేసి కొంగొత్తగా తీర్చిదిద్దారు.  ప్రత్యేక వాస్తుశిల్పంతో, గ్రానైట్‌తో నిర్మించిన ఎంజే మార్కెట్‌ పైకప్పును జాక్‌ ఆర్చెస్‌ పద్ధతిలో నిర్మించారు. నిర్వహణ లోపంతో కాలక్రమేణా దెబ్బతిన్నది. ఫ్లోరింగ్‌ పూర్తిగా దెబ్బతిన్నది. వేలాడే కేబుళ్లు అడ్డగోలు బోర్డులు తదితరాలతో కళ కోల్పోయిన ఎంజే మార్కెట్‌కు రెండేళ్లుగా చేసిన పనులతో నూతన శోభ తెచ్చారు. హైదరాబాద్‌ నగర చారిత్రక వారసత్వ నిర్మాణ కౌశలానికి  ప్రతీకగా ఉన్న దీనిపై ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపింది. దాదాపు రూ.15 కోట్లు ఖర్చయినట్లు అంచనా. అర్వింద్‌కుమార్‌ దత్తత తీసుకున్నప్పుడే మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ పునరుద్ధరణకు ముందు.. తర్వాత ఫొటోలను పోల్చిచూస్తానని పేర్కొన్నారు.  
 
అధునాతన సాంకేతికతతో..  
వారసత్వ సంపద చెక్కు చెదదరకుండా ఉండేందుకు పునరుద్ధరణ చర్యల్లో భాగంగా నిర్మాణంలోని ప్రతి భాగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ, ఎక్కడ బలహీనపడిందో గుర్తిస్తూ, డాక్యుమెంటేషన్‌ కూడా చేసినట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది. భవనం పైకప్పులో పెరిగిన పిచ్చిమొక్కలను వేళ్లతో సహా జాగ్రత్తగా తొలగించి ఏర్పడ్డ ఖాళీని సాంకేతిక పరిజ్ఞానంతో ¿భర్తీచేశారు. వర్షపునీరు కారకుండా ఉండేందుకు వ్యాపారులు పైకప్పు మీద పొరలుపొరలుగా వేసిన తారును మొత్తం తొలగించి, అధునాతనంగా తీర్చిదిద్దారు. జాక్‌ ఆర్చిలను కొన్నిచోట్ల పూర్తిగా పునర్నిర్మించారు. బాల్కనీలు/గవాక్షాలు వాటికి ఊతంగా అమర్చిన బ్రాకెట్‌లు విరిగిపోవడంతో పూర్వ రూపానికి తెచ్చేందుకు సున్నం, మోర్టార్‌ (గచ్చు) మిశ్రమాలను వినియోగించారు. వలయాకారంలో అమర్చిన మెట్లను పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు. గోడలు, గుమ్మటాలపై పిచ్చి రంగులు, పెచ్చులను జాగ్రత్తగా తొలగించారు. గడియారపు స్తంభం సహజ సౌందర్యం కోసం ఎంతో శ్రమించినట్లు అధికారులు పేర్కొన్నారు. మూగబోయిన గడియారపు గంటలు వినపడేలా చేశారు. మినార్‌లను, వాటి గుమ్మట శిఖరాలను బంగారు పూత మెరుపులతో కుంభాకార కలశాల వంటి వాటితో అలంకరించారు. 

మొత్తం మార్కెట్‌ ప్రదేశంలో కాలిబాటలు,  వాటికి కంచెగా చిన్న స్తంభాలను, ప్రజలు కూర్చుని సేదదీరడానికి బెంచీలు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక సందర్భాల్లో  శోభాయమానంగా కనిపించడానికి వీలుగా ప్రత్యేక లైటింగ్‌కు తగిన ఏర్పాట్లు చేశారు. భూగర్భ డ్రైనేజీ, వర్షపునీరు నిలవకుండా పనులు చేశారు. చరిత్రకారులు, నిర్మాణరంగ ప్రముఖులు, దుకాణాదారులు తదితర వర్గాల వారు అందించిన అమూల్య అభిప్రాయాలు కూడా పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించాయి. 1935 నాటి ఎంజే మార్కెట్‌ ఇన్నాళ్లకు కొత్త ఠీవితో నిలిచింది. నాటి జ్ఞాపకాలు గుర్తు చేసే విధంగా మార్కెట్‌కు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. జీహెచ్‌ఎంసీ పర్యవేక్షణలో పునరుద్ధరణ çపనులను దూలం సత్యనారాయణ ఫొటోలు తీశారు. చలనచిత్రంగా రూపొందించారు. ఎంజే మార్కెట్‌ పునఃప్రారంభం నుంచి మూడు రోజులపాటు ప్రజల సందర్శనార్థం ఒక ఫొటో గ్యాలరీ అందుబాటులో ఉంటుందని జీహెచ్‌ఎంసీ పేర్కొంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వంద అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

మరిన్ని వార్తలు