పని చేస్తున్నారా.. ఇంట్లో పడుకుంటున్నారా ?!

27 May, 2021 11:10 IST|Sakshi
చెక్‌డ్యాం పనులను చూపిస్తూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే

 ఇరిగేషన్‌ అధికారులపై ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ ఆగ్రహం

సాక్షి, వరంగల్‌: రూ.కోట్ల కొద్ది నిధులతో నిర్మిస్తున్న చెక్‌ డ్యాం పనులును పరిశీలించకుండా ఇరిగేషన్‌ అధికారులు ఇంట్లో పడుకుంటున్నారా అని ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు సమీప పాకాలవాగుపై నిర్మిస్తున్న చెక్‌ డ్యాం పనులను బుధవారం ఎమ్మెల్యే పరిశీలించారు. అంతకుముందు వడ్డెరగూడెం సమీపంలోని చెక్‌ డ్యాం నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఖంగుతిన్నారు. ఇవేం పనులు.. అంటూ ఇరిగేషన్‌ డీఈ ఉపేందర్, ఏఈలు నిహారిక, శేఖర్‌ను పిలిచి ఆరా తీశారు. ‘అసలు మీరేం చేస్తున్నారు? మొత్తం మట్టి కనిపిస్తుంది.

సిమెంట్‌తో కడుతున్నారా.. మట్టితోనా’ అని ప్రశ్నించారు. ‘మీరసలు పనుల వద్దకు వస్తున్నారా.. కమీషన్లు తీసుకొని ఇంటి వద్దనే ఉంటున్నారా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో డీఈ ఉపేందర్‌ కలగచేసుకుని ఇంతకాలం మరో డీఈ ఉండేవారని, తాను కొత్తగా వచ్చినట్లు చెప్పగా ఏఈలపై ఆగ్రహం చేశారు. మరో రెండు వారాల్లో డ్యాం చుట్టూ కట్టే రాతి కట్టడాలలో సిమెంట్‌ నింపి కట్టాలని, ఇలా మట్టితో కాదని సూచించారు. మళ్లీ వచ్చి చూసే వరకు నాణ్యత లేకుంటే బిల్లులు ఆపిస్తానని హెచ్ఛరించారు. 

చదవండి: భిక్కనూరులో పాజిటివ్‌.. నిజామాబాద్‌లో నెగెటివ్‌

మరిన్ని వార్తలు