ఎమ్మెల్యే రాలేదని జెండా ఆవిష్కరణలో గందరగోళం 

16 Aug, 2022 01:36 IST|Sakshi
గాంధీ పార్కులో మహాత్ముని విగ్రహం ముందు మౌన దీక్షకు దిగిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌  

కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో అధికార పార్టీలో నెలకొన్న విభేదాలు బట్టబయలయ్యాయి. కోదాడ మున్సిపాలిటీలో ఉదయం 8:30కు జెండా ఆవిష్కరణ ఉంటుందని మున్సిపాలిటీ అధికారులు, చైర్‌పర్సన్‌ పట్టణంలో ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. ఆ సమయానికే పలువురు మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకోగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ మాత్రం 9గంటలై నా రాలేదు.

దీంతో 9:10 నిమిషాలకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనపర్తి శిరీష కార్యక్రమాన్ని ప్రారంభించగా..ఎమ్మెల్యే వచ్చే వరకు జెండా ఎగుర వేయవద్దని మున్సిపల్‌ కమిషనర్‌ అడ్డుతగిలారు. వాగ్వాదాల మధ్యే జెండాను ఆవి ష్కరించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మున్సిపాలిటీకి రాకుండానే పక్కనే ఉన్న గాంధీ పార్కుకు వెళ్లి జాతీయ జెండాను ఆవిష్క రించారు.

ఇదే ఆవరణలో ఉన్న కోదాడ గ్రంథాలయం వద్ద జెండా ఆవిష్కరణకు ఎమ్మెల్యే వెళ్లగా అక్కడికి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ శీరిష కూడా వెళ్లారు. అక్కడ ఆమెను కోదాడ ఎంపీపీ చింతా కవిత, మార్కెట్‌ చైర్‌పర్సన్‌ సుధారాణి నెట్టి వేశారు. దీంతో తనను వేధిస్తు న్నారంటూ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గాంధీ విగ్రహం ముందు మౌన దీక్షకు దిగారు.

మరిన్ని వార్తలు