కాళేశ్వరం ఫొటోలు గూగుల్‌లో పెట్టండి: శ్రీధర్‌బాబు

20 Jul, 2022 00:47 IST|Sakshi
ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుతో మాట్లాడుతున్న డీఈఈ సూర్య ప్రకాశ్‌ 

కాళేశ్వరం: ‘కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ దేశాల్లో గొప్ప కట్టడమని గూగుల్‌లో చూడాలని కేటీఆర్‌ ఎక్కడికెళ్లినా చెబుతున్నారు. ఇప్పుడు నీట మునిగిన కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంప్‌హౌస్, అన్నారంలోని సరస్వతీ పంప్‌హౌస్, గ్రావిటీ కాల్వల ప్రస్తుత ఫొటోలను గూగుల్‌లో పెట్టండి’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంత్రి కేటీఆర్‌కు సూచించారు.

మంగళవారం ఆయన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పరిధిలోని లక్ష్మీ పంప్‌హౌస్‌లోకి తన కార్యకర్తలతో వెళ్లేందుకు రాగా కాళేశ్వరం ఎస్సైలు లక్ష్మణ్‌రావు, నరేశ్‌ అడ్డుకున్నారు. కొంత సమయం తర్వాత డీఈఈ సూర్యప్రకాశ్‌.. ఎమ్మెల్యే వద్దకు చేరుకుని అనుమతి లేదని, ఉన్నతాధికారుల ఆదేశాలున్నాయని, పంప్‌హౌస్‌ బాగానే ఉందని చెప్పి వెళ్లారు.

ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ వైఫల్యంతో నీట మునిగిందని, మరమ్మతులు చేస్తున్నట్లు ఇంజనీర్లు చెబుతున్నారని, కానీ నిర్వహణా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. ప్రజాధనాన్ని వృథా చేసి, నాసిరకం పనులు చేయడంతో అవినీతి జరిగిందని మండిపడ్డారు. క్లౌడ్‌ బరస్ట్‌పైన సీఎం కేసీఆర్‌కు ఏమైనా సమాచారం ఉంటే కేంద్ర నిఘా బృందాలకు అందించాలన్నారు.

మరిన్ని వార్తలు