జ్వరంగా ఉంది.. ఇంద్రవెల్లి సభకు రాలేను: జగ్గారెడ్డి

9 Aug, 2021 02:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత వారం రోజులుగా తనకు జ్వరంగా ఉందని, అందుకే ఇంద్రవెల్లి దళిత, గిరి జన దండోరా సభకు తాను రాలేనని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే సభ విజయవంతం కోసం అన్ని ప్రయత్నాలు చేశామని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. నాయకులందరినీ సమన్వయం చేయడంలో కీలకపాత్ర పోషించిన తాను సభకు రానంత మాత్రాన చిలువలు పలువలు చేయొద్దని, కాంగ్రెస్‌ కేడర్‌ కూడా గందరగోళానికి గురికావద్దని వెల్లడించారు.

తనకు జ్వరం వచ్చినందున కోర్టుకు కూడా వెళ్లలేకపోయానని, అందుకే వారంట్‌ కూడా జారీ అయిందని తెలిపారు. ఇంద్రవెల్లి సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ నేతలు, శ్రేణులు కృషి చేయాలని ఆ ప్రకటనలో జగ్గారెడ్డి కోరారు. కాగా, ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. ఇంద్రవెల్లి సభ విజయవంతంపై ఆయనతో చర్చించిన రేవంత్, సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు