కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

23 Feb, 2024 14:18 IST|Sakshi

వెంటాడిన మృత్యువు

రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం

పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌పై దుర్ఘటన.. స్పాట్‌లోనే లాస్య మృతి

ఎమ్మెల్యేగా గెలిచాక వరుస ప్రమాదాలు

పది రోజుల కిందటే నల్లగొండ వద్ద రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలు

అంతకు ముందు.. 3గం. పాటు లిఫ్ట్‌లోనూ ఇరుక్కున్న ఘటన

కంటోన్మెంట్‌ మాజీ ఎమ్మెల్యే, దివంగత సాయన్న కుమార్తె లాస్య నందిత

తండ్రి మరణంతో తనయకు టికెట్‌ ఇచ్చిన బీఆర్‌ఎస్‌

అసెంబ్లీ ఎన్నికల్లో 17 వేల మెజార్టీతో నెగ్గిన లాస్య

తండ్రి చనిపోయిన ఏడాదికే యాక్సిడెంట్‌లో లాస్య దుర్మరణం

యువ నేత అకాలమరణంపై రాజకీయ ప్రముఖుల దిగ్భ్రాంతి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత(33) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం వేకువ ఝామున పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడిపిన ఆమె పీఏ, స్నేహితుడు ఆకాష్‌కు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.


సుల్తాన్‌పూర్‌ వద్ద ఓఆర్‌ఆర్‌పై ప్రమాదానికి గురైన కారు

నిద్రమత్తులోనే?
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ సుల్తాన్‌పూర్‌ ఓఆర్‌ఆర్‌ వద్ద ఈ తెల్లవారు ఝామున దుర్ఘటన చోటు చేసుకుంది. మొక్కులు తీర్చుకునే క్రమంలో లాస్య తప్ప ఆమె కుటుంబ సభ్యులంతా గురువారం రాత్రి సదాశివపేట (మం) కొనాపూర్‌లోని మిస్కిన్ బాబా దర్గాకి వెళ్లారు. కాసేపటికే  ఆకాష్‌తో పాటు లాస్య కూడా దర్గాకి వచ్చారు. లాస్య కుటుంబం అంతా రాత్రి 12.30 గంటలకు దర్గాలో పూజలు చేశారని అక్కడి నిర్వాహకులు చెబుతున్నారు. తిరిగి.. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో హైదరాబాద్‌కు లాస్య కుటుంబం పయనం అయ్యింది. మొక్కులు తీర్చుకున్న తర్వాత.. 3 నుంచి 4 గంటల మధ్య లాస్య కారు బయల్దేరిందని చెప్తున్నారు. అయితే.. పటాన్ చెరు వైపు ఎందుకు ఆమె వాహనం వెళ్లింది అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

 డ్రైవర్‌ సీట్‌లో ఉన్న వ్యక్తి నిద్రమత్తు, వాహన అతివేగం ప్రమాదానికి కారణాలైన ఉంటాయని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో సడన్‌ బ్రేక్‌ వేయడంతో కారు అదుపు తప్పి.. రెయిలింగ్‌ను బలంగా ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఆ సమయంలో లాస్య సీటు బెల్ట్‌ పెట్టుకోకపోవడం వల్ల అక్కడికక్కడే మృతి చెందారు. 


సుల్తాన్‌పూర్‌ వద్ద ఓఆర్‌ఆర్‌పై ప్రమాదానికి గురైన కారు

తల్లడిల్లిన తల్లి గుండె
ఈ ప్రమాదంలో కారు ముందు భాగం బాగా దెబ్బతింది. డ్రైవర్‌  పక్క సీట్లో కూర్చున్న లాస్య నందిత స్పాట్‌లోనే మృతి చెందారు. తీవ్రగాయాలైన ఆకాశ్‌ను మియాపూర్‌ మదీనగూడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. లాస్య నందిత మృతదేహాన్ని పటాన్‌చెరు అమెథా ఆస్పత్రికి తరలించారు. కూతురి మరణవార్త విని తల్లి స్పృహ తప్పి పడిపోయారు. మృతదేహాన్ని చూసి గుండెలు పగిలేలా రోదించారు. సోదరి నివేదితా రోదన  పలువురిని కంటతడి పెట్టించింది. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ హరీష్‌రావు ఆస్పత్రికి వెళ్లి లాస్య కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. గాంధీ ఆస్పత్రిలో లాస్య మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహం అందజేస్తారు. ఇక.. యువ ఎమ్మెల్యే మృతి పట్ల బీఆర్‌ఎస్‌ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.


లాస్య కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన హరీష్‌రావు

సీఎం రేవంత్‌ దిగ్భ్రాంతి..
లాస్య నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నందిత తండ్రి సాయన్నతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అధికారుల్ని సీఎం రేవంత్‌ ఆదేశించారు. ఇక పలువురు మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు సైతం లాస్య మృతిపై సంతాపం ప్రకటించారు. మంత్రి కోమటిరెడ్డి గాంధీ ఆస్పత్రికి వెళ్లి లాస్య కుటుంబాన్ని పరామర్శించారు. లాస్య మృతి బాధాకరమని.. ఎమ్మెల్యేగా ఆమె ప్రజలకు ఇచ్చిన హామీల్ని తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు.

లాస్య నందిత మృతిపై బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందారని.. రోడ్డు ప్రమాదంలో అకాల మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారాయన. బీఆర్‌ఎస్‌ నేతలు తలసాని, హరీష్‌రావు, కేటీఆర్‌, మల్లారెడ్డి.. తదితరులు లాస్య మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత లాస్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. లాస్య అంత్యక్రియలు అయ్యేదాకా ఆమె కుటుంబ సభ్యులతోనే ఉండాలని బీఆర్‌ఎస్‌ అధిష్టానం కవితకు సూచించినట్లు తెలుస్తోంది.

ఘటనపై పోలీసుల దర్యాప్తు
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామునే ప్రమాదం జరగ్గా.. ప్రాథమికంగా వచ్చిన అంచనాతో దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోప్రమాద తీరును పోలీసు బృందాలు పరిశీలించాయి. త్వరలో కుటుంబ సభ్యులనూ పోలీసులు విచారించే అవకాశం ఉంది.

ఫస్ట్‌ టైం ఎమ్మెల్యే.. 
లాస్య నందిత కంటోన్మెంట్‌ మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె. గతేడాది ఫిబ్రవరిలో సాయన్న గుండె పోటుతో మృతి చెందారు. దీంతో ఆ స్థానంలో లాస్య నందితకు బీఆర్‌ఎస్‌ అధిష్టానం టికెట్‌ ఇచ్చింది. నవంబర్‌ చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 17,169 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉందని భావిస్తున్న తరుణంలో.. అదీ చిన్న వయసులో లాస్య ఇలా దుర్మరణం చెందడం పట్ల పలువురు నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.   

10 రోజుల కిందటే ప్రమాదం.. 
ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక లాస్య నందిత వరుసగా ప్రమాదాలకు గురయ్యారు. ఫిబ్రవరి 13వ తేదీన న‌ల్ల‌గొండలో కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరిగింది. ఎమ్మెల్యే లాస్య నందిత కూడా ఈ సభకు వెళ్లారు. ఆ సమయంలో ఆమె ప్ర‌యాణిస్తున్న కారును నార్క‌ట్‌ప‌ల్లి వ‌ద్ద ఓ టిప్ప‌ర్ ఢీకొట్టింది. దీంతో ఆమె వెళ్తున్న కారు ముందు టైర్ ఊడిపోయింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య త‌ల‌కు స్వ‌ల్ప గాయ‌మైంది కూడా. అయితే ఆ సమయంలోనూ ఆకాషే(25) కారు నడిపినట్లు తెలుస్తోంది. 

అంతకు ముందు.. కిందటి ఏడాది డిసెంబర్‌లో ఓ కార్యక్రమానికి వెళ్లిన ఆమె మూడు గంటలపాటు లిఫ్ట్‌లో  ఇరుక్కుపోయారు. సిబ్బంది అతికష్టం మీద లిఫ్ట్‌ను బద్ధలు కొట్టి ఆమెను, ఆమెతో పాటు ఉన్నవాళ్లను బయటకు తీశారు. తండ్రి సాయన్న చనిపోయిన ఏడాదికే.. ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతి చెందడం గమనార్హం.


నార్కట్‌పల్లి వద్ద లాస్య కారుకు ప్రమాదం

కుటుంబ నేపథ్యం.. 
సాయన్న, గీతలకు లాస్య నందిత జన్మించారు. ఆమెకు ఇద్దరు సోదరీమణులు.. నమ్రతా, నివేదితా. లాస్య కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ చేశారు. లాస్య నందిత గతంలో కవాడిగూడ కార్పొరేటర్‌గానూ పని చేశారు. తండ్రి మరణంతో ఆమెకు బీఆర్‌ఎస్‌ సీటు ఇవ్వగా.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎన్‌ గణేష్‌పై 17 వేల ఓట్లకు పైగా ఆధిక్యంతో లాస్య గెలుపొందారు. ఏడాదికే.. ప్రజాప్రతినిధుల హోదాలోనే ఈ తండ్రీకూతుళ్లిద్దరూ మృతి చెందడంతో పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


తండ్రి సాయన్నతో లాస్య నందిత

whatsapp channel

మరిన్ని వార్తలు