ఎమ్మెల్యేలకు ఎర కేసు: నందుతో ఏం మాట్లాడారు?

29 Nov, 2022 02:18 IST|Sakshi

చిత్రలేఖ, విజయ్‌లను ప్రశ్నించిన సిట్‌ అధికారులు 

ఇరువురి నుంచి కరువైన సరైన సమాధానాలు 

మరోసారి ప్రశ్నించే అవకాశం 

విచారణకు మరో తేదీ కోరిన ఏపీ ఎంపీ రఘురామ  

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక నిందితుడు నందుకుమార్‌ భార్య చిత్రలేఖ, ఓ స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి ఎం.విజయ్‌కుమార్‌ మాదిగ సోమవారం సిట్‌ ఎదుట హాజరయ్యారు. సిట్‌ అధికారులు దాదాపు 8 గంటల పాటు ఇరువురినీ వేర్వేరుగా, కలిపి పలు ప్రశ్నలు సంధించారు. అయితే వీరి నుంచి సరైన సమాధానాలు రాలేదని తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి చిత్రలేఖ, నందు మధ్య సంప్రదింపులు, సమాచార మార్పిడి జరిగినట్లు ఇప్పటికే సిట్‌ గుర్తించింది.

తాను చేసే ప్రతి పని గురించి చిత్రలేఖకు చెప్పడం నందుకు అలవాటు. కొన్ని కీలక లావాదేవీలు, వ్యవహారాలకు సంబంధించిన అంశాల స్క్రీన్‌షాట్స్‌ కూడా ఆమెకు పంపినట్లు గుర్తించారు. సిట్‌ ఆ వివరాలను ఆమె నుంచి రాబట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, సింహయాజీ సైతం పలుమార్లు నందు ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో వాళ్లు ఎవరెవరిని కలిసే వారు? ఏం మాట్లాడుకునే వారు? ఎక్కడెక్కడ తిరిగారు? తదతర వివరాలను చిత్రలేఖ నుంచి రాబట్టడానికి సిట్‌ పలు ప్రశ్నల్ని సంధించింది. అయితే, ఆమె నుంచి సరైన సమాధానాలు రాలేదని అధికారులు చెప్తున్నారు. దీంతో మరో రోజు విచారణకు రప్పించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.  

అలాచేస్తే బీజేపీలో చేరతా! 
సోమవారం సిట్‌ అధికారులు స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి ఎం.విజయ్‌కుమార్‌ను కూడా ప్రశ్నించారు. ఈయన కాంగ్రెస్‌ సిటీ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. తనకు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో సభ్యుడిగా అవకాశం కల్పించాలని, అలా చేస్తే తాను కూడా బీజేపీలో చేరతానంటూ నందుతో సంప్రదింపులు జరిపారు. సాంకేతిక ఆధారాలను బట్టి ఈ విషయం గుర్తించిన సిట్‌ దానిపైనే విజయ్‌ను ప్రశ్నించింది.

ఇందులో భాగంగా ఆర్థిక లావాదేవీలేమైనా జరిగాయా? నందును కాకుండా ఇంకా ఎవరినైనా కలిశారా? ఢిల్లీకి వచ్చారా? తదితర వివరాలు సేకరించారు. కాగా, ఏపీలోని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు నందు, రామచంద్ర భారతిలతో సంబంధాలు ఉన్నట్లు సిట్‌ గుర్తించింది. వీళ్లు ముగ్గురూ పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కీలక వ్యక్తులను కలిసినట్లు ఆధారాలు సేకరించారు.

దీనిపై ప్రశ్నించడానికి మంగళవారం ఉదయం 10.30 గంటలకు తమ ముందు హాజరు కావాలని అధికారులు రఘురామకు నోటీసులు జారీ చేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో విచారణకు రాలేనని రఘురామ సిట్‌కు సమాచారమిచ్చారు. మరో రోజు అవకాశమిస్తే వచ్చి వాంగ్మూలం ఇస్తానని పేర్కొన్నారు. దీంతో మరో తేదీని ఖరారు చేసి ఆయనను ప్రశ్నించాలని సిట్‌ నిర్ణయించింది.   

మరిన్ని వార్తలు