ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: విచారణ నేటి మధ్యాహ్నానికి వాయిదా

8 Feb, 2023 02:27 IST|Sakshi

హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేసిన రాష్ట్ర ప్రభుత్వం

సీబీఐ అత్యుత్సాహాన్ని పరిగణనలోకి తీసుకోండి అని వినతి

డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలపై సింగిల్‌ జడ్జి స్టే ఇవ్వలేరన్న పిటిషనర్‌ న్యాయవాదులు

సీజే నుంచి స్పష్టత తీసుకోవాలని ఏజీని ఆదేశించిన జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసే వరకు ఆ తీర్పు అమలును నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అత్యవసర లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. సీబీఐ దర్యాప్తు చేయాలంటూ ఇచ్చిన తీర్పును మూడువారాలపాటు నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని రాజేంద్రనగర్‌ ఏసీపీ బి.గంగాధర్‌ మంగళవారం ఈ పిటిషన్‌ వేశారు.

దీనిపై జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ, సీబీఐ దర్యాప్తు తీర్పును వారం రోజులైనా నిలిపివేయాలని కోరారు. సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకు (పిటిషన్‌ను విచారణకు స్వీకరించే వరకు) స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సింగిల్‌ జడ్జి తీర్పుపై ద్విసభ్య ధర్మాసనం మెరిట్స్‌లోకి వెళ్లలేదు కాబట్టి తమ లంచ్‌మోషన్‌ పిటిషన్‌లో సింగిల్‌ జడ్జి జోక్యం చేసుకోవచ్చని జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి ప్రశ్నకు ఏజీ సమాధానమిచ్చారు.

సీబీఐ దర్యాప్తును నిలుపుదల చేస్తూ స్టే ఇవ్వొచ్చని చెప్పారు. ప్రస్తుతం సిట్‌ విచారణ నిలిచిపోయిందని, ఈ పరిస్థితుల్లో సీబీఐ దర్యాప్తు చేసేందుకు అత్యుత్సాహం చూపడం సరికాదన్నారు. ఇప్పటికే సీబీఐ జేడీ ఫైళ్లు అప్పగించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారని, సీబీఐ అత్యుత్సాహాన్ని పరిగణనలోకి తీసుకుని స్టే ఇవ్వాలని కోరారు. 


ఈ కేసులో డివిజన్‌ బెంచ్‌ స్టే ఇచ్చిందా అని న్యాయమూర్తి ప్రశ్నించగా, సింగిల్‌ జడ్జి తీర్పు తర్వాత దర్యాప్తు కోసం సీబీఐ ప్రభుత్వంపై ఒత్తిడి చేయొద్దని ఉత్తర్వుల్లో స్పష్టంచేసిందని ఏజీ బదులిచ్చారు. ద్విసభ్య ధర్మాసనం అప్పీల్లోని మెరిట్స్‌ ఆధారంగా తుది ఉత్తర్వులు ఇవ్వలేదని, అప్పీల్‌కు విచారణార్హత లేదని తేల్చినందున సింగిల్‌ జడ్జి జోక్యం చేసుకోవచ్చన్నారు.

నిందితుల తరఫు సీనియర్‌ న్యాయవాదులు రవిచందర్, ప్రభాకర్‌ తదితరులు వాదనలు వినిపిస్తూ.. ద్విసభ్య ధర్మాసనం తీర్పు చెప్పాక స్టే కోసం సింగిల్‌ జడ్జి వద్దకు ప్రభుత్వం రావడం నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టుకు వెళ్లడం తప్ప మరోమార్గం లేదని, సింగిల్‌ జడ్జి స్టే ఇవ్వడానికి ఆస్కారం లేదని వాదించారు. సింగిల్‌ జడ్జి తీర్పుపై సీజే బెంచ్‌ వద్ద అప్పీల్‌ దాఖలు చేస్తే తీర్పు వచ్చిందని, ఇప్పుడు మళ్లీ అదే సింగిల్‌ జడ్జి వద్దకు స్టే కోసం ఎలా వస్తారని ప్రశ్నించారు.

సుప్రీంకోర్టుకు వెళ్లేవరకు ఆదేశాలను నిలుపుదల చేయడానికి ద్విసభ్య ధర్మాసనం నిరాకరించిందని గుర్తుచేశారు. సిట్‌ దర్యాప్తు చేయాలని భావించడమూ అత్యుత్సాహం కిందకే వస్తుందని చెప్పారు. వాదనలు విన్న తర్వాత జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి.. ద్విసభ్య ధర్మాసనం తీర్పు తర్వాత స్టే కోసం సింగిల్‌ జడ్జిని ఆశ్రయించవచ్చో లేదో చీఫ్‌ జస్టిస్‌ నుంచి స్పష్టత తీసుకుని చెప్పాలని ఏజీని ఆదేశించారు. బుధవారం సీజే బెంచ్‌ వద్ద స్పష్టత తీసుకుని చెబుతామని ఏజీ చెప్పడంతో విచారణను బుధవారం మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి చెప్పారు.  

మరిన్ని వార్తలు