ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్‌ నవ్య ఎపిసోడ్‌లో బిగ్‌ ట్విస్ట్‌

13 Mar, 2023 09:47 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ జానకిపురం సర్పంచ్‌ నవ్య ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా, ఆదివారం.. సర్పంచ్‌ నవ్య ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే రాజయ్య.. మీడియా సమక్షంలో ఆమెకు క్షమాపణ చెప్పారు. సర్పంచ్ భర్తకు షేక్ హ్యాండ్ ఇచ్చిన రాజయ్య.. నవ్య దంపతులతో కలిసి ఎమ్మెల్యే మీడియా సమావేశం నిర్వహించారు.

వేధిస్తే భరితం పడతాం: సర్పంచ్‌ నవ్య
సర్పంచ్‌ నవ్య మాట్లాడుతూ, మహిళలకు అన్యాయం జరుగుతోందని, తాను మాట్లాడిన ప్రతి మాట నిజం అంటూ మండిపడ్డారు. అన్యాయాలు, అరాచకాలు సహించవద్దని ఆమె అన్నారు. చిన్న పిల్లలను కూడా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని, మహిళలను ఎవరైనా వేధిస్తే భరితం పడతామని సర్పంచ్‌ హెచ్చరించారు. ‘‘ఎమ్మెల్యే రాజయ్యను గౌరవిస్తా. ఆయన వల్లే నేను సర్పంచ్‌ అయ్యా. నేను మాట్లాడిన దానికి కట్టుబడి ఉన్నా. పార్టీని ఒక కుటుంబంలా భావిసా. జరిగిన విషయాన్ని మరిచిపోయి ఇక ముందు అలాంటివి జరగకుండా చూడాలని కోరుకుంటున్నా. తప్పు చేసినట్టు ఒప్పుకుంటే క్షమిస్తా’’ అని సర్పంచ్‌ నవ్య అన్నారు.

క్షమించమని కోరుతున్నా.. ఎమ్మెల్యే రాజయ్య
జరిగిన పరిణామాలకు చింతిస్తున్నానని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ‘‘నాకు నలుగురు అక్క చెల్లెళ్లు ఉన్నారు. ప్రవీణ్‌పై అభిమానంతో ఆయన భార్యకు సర్పంచ్‌ టికెట్‌ ఇచ్చా.. నేను తెలిసి తెలియక చేసిన పనులు వల్ల మానసిక క్షోభకు గురైతే క్షమించమని కోరుతున్నా. జానకిపురం అభివృద్ధికి పాటుపడుతా. అధిష్టానం ఆదేశం మేరకు రూ.25 లక్షలు తక్షణమే మంజూరు చేస్తున్నా’’ అని రాజయ్య పేర్కొన్నారు.

కాగా, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మహిళా కమిషన్‌ యాక్షన్‌కు సిద్ధమైంది. ఆయనపై జానకీపురం మహిళ సర్పంచ్‌ నవ్య చేసిన ఆరోపణలను మహిళా కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది.  ఈ క్రమంలో రాజయ్యపై వ్యక్తిగత విచారణ చేయాలని డీజీపీకి మహిళా కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ట్విట్ట​ర్‌ వేదికగా కమిషన్‌ ఛైర్మన్‌ సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు. 

అసలేం జరిగింది..
ఎమ్మెల్యే రాజయ్య తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని.. లైంగికంగా వేధిస్తున్నారని సర్పంచ్‌ నవ్య తీవ్ర ఆరోపణలు చేశారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే కాల్‌ చేసి బయటకు రమ్మంటున్నారని నవ్య ఆరోపణలు చేస్తున్నారు. రాజయ్య మాట్లాడిన కాల్‌ రికార్డ్స్‌ ఉన్నాయని పేర్కొన్నారు. సమయం చూసి అవన్నీ భయటపెడతానని అన్నారు. తన వెనక ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఎవరో చెప్పిన మాటలు వినాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఇటువంటి వేధింపులు ఎదుర్కొంటూ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
చదవండి: బీఆర్‌ఎస్‌లో ‘చిలిపి’ రాజకీయం!

‘నీ మీద కోరికతోనే పార్టీ టికెట్‌ ఇచ్చానని అన్నారు. పక్కన నిలబడితే ఎక్కడెక్కడో చేయి వేస్తారు. హగ్‌ చేసుకోవడానికి వస్తారు. బిడ్డలాంటి దాన్ని అని చెప్పినా మారరా. మీకు సహకరించకుంటే నా బతుకు నాశనం చేస్తారా. రావాల్సిన నిధులు రాకుండా అడ్డుకుంటారా. దయచేసి ఇప్పటికైనా ఈ అరాచకాలు మానండి. ఇలాంటి వారితో పార్టీకి చెడ్డ పేరు వస్తోంది. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలి’ అని తెలిపారు.


 

మరిన్ని వార్తలు