రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే

15 Oct, 2020 15:55 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతన్నకు అపార నష్టం వాటిల్లింది. ప్రాధమిక అంచనా ప్రకారం జిల్లా వ్యాప్తంగా 30 వేల ఎకరాల్లో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వరి పంట వేసిన రైతులకు పెట్టుబడి సైతం రాని పరిస్థితి నెలకొంది. వర్షం వరదలతో చేతికందే దశలో ఉన్న వరి పంట నేలవాలి అక్కరకు రాకుండా పోయింది. ఇప్పటికే కోసి కల్లాల్లో ఉన్న వరి ధాన్యం తడిసి మొలకెత్తే పరిస్థితి ఏర్పడింది. పంట నష్టాన్ని చూసి రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో చొప్పదండి మండలంలో దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో పాటు వ్యవసాయ శాఖ అధికారులు గురువారం పర్యటించారు.

క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించిన ఆయన రైతులను ఓదార్చారు. ఆరుకాలాల పాటు శ్రమించే అన్నదాతకు అకాల వర్షంతో అపార నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం మొలకెత్తడం చూసి అమ్ముకోవడానికి సిద్ధం చేయాలని, రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆదేశం మేరకు పంట నష్టాన్ని అంచనా వేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రైతులకు ఏమైన ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు