‘మార్నింగ్‌ వాక్‌’ @ 34 ఏళ్లు 

24 Jan, 2021 08:18 IST|Sakshi

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం  

1987లో శ్రీకారం చుట్టిన సుధీర్‌రెడ్డి 

ఇప్పటికీ కొనసాగిస్తున్న ఎమ్మెల్యే 

సాక్షి, ఎల్‌బీనగర్‌: మార్నింగ్‌ వాక్‌ పాదచారిగా పేరుగాంచిన ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హయత్‌నగర్‌లో శనివారం చేసిన పాదయాత్రతో 34 ఏళ్లు పూర్తయ్యాయి. కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో చేసిన మార్నింగ్‌ వాక్‌కు మంచి ఆదరణ రావడంతో మొదటిసారిగా హుడా చైర్మన్‌గా, 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో మార్నింగ్‌ వాక్‌ చేసి ప్రజల మన్ననలను పొందారు ఆయన. ఆదే స్ఫూర్తితో పదవిలో ఉన్నా లేకున్నా సమస్యల కోసం నియోజకవర్గంలో మార్నింగ్‌ వాక్‌ చేసేవారు. ఇలా 34 సంవత్సరాల పాటు మార్నింగ్‌వాక్‌ చేసిన ఘనత సుధీర్‌రెడ్డికే దక్కింది. 

ఆంధ్ర కాలనీలో తెల్లవారుజామున 4.30 గంటలకు
1987 జనవరి 23న అప్పట్లో అక్బర్‌బాగ్‌ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో మంచినీటి సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. సూర్యుడి కంటే ముందే సుధీరన్న  అనే కార్యక్రమం ద్వారా తొలిసారిగా ఆంధ్ర కాలనీలో తెల్లవారుజామున 4.30 గంటలకు మార్నింగ్‌ వాక్‌ చేపట్టారు. దీనికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. సమస్యలు సైతం సత్వరమే పరిష్కారమయ్యేవి.

ఇలా ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో 100కుపైగా కాలనీల్లో మార్నింగ్‌ వాక్‌ చేసిన ఘనత ఆయనది. తొలుత మంచినీటి కోసం చేసిన మార్నింగ్‌ వాక్‌ ప్రస్తుతం రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, కాల్వలు, చెరువుల సుందరీకరణ తదితర అంశాలపై ఆయన దృష్టి సారించారు. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. మార్నింగ్‌ వాక్‌కు ప్రజల నుంచి వచ్చిన ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేనన్నారు.

మరిన్ని వార్తలు