ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. బీఎల్‌ సంతోష్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట

25 Nov, 2022 17:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో బీజేపీ కీలక నేత, కర్ణాటకకు చెందిన సీనియర్‌ పొలిటీషియన్‌ బీఎల్‌ సంతోష్‌కు ఊరట లభించింది.  సిట్‌ నోటీసులపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. అంతేకాదు.. విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది. 

సిట్‌ నోటీసులను సవాల్‌ చేస్తూ బీఎల్‌ సంతోష్‌ ఇవాళ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన క్వాష్‌ పిటిషన్‌లో.. సిట్‌ నోటీసులను రద్దు చేయాలని కోరారు. రోహిత్‌రెడ్డి చేసిన ఫిర్యాదులో బీఎల్‌ సంతోష్‌​ పేరు లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఆయన తరపు న్యాయవాది. అంతేకాదు ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేనప్పుడు.. ఆయన్ని నిందితుల జాబితాలో ఎలా చేరుస్తారని బీఎల్‌ సంతోష్‌ తరపు న్యాయవాది అభ్యంతరం లేవనెత్తారు.

ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. సిట్‌ నోటీసులపై స్టే విధించింది. అంతకు ముందు.. ఫాంహౌజ్‌ కేసులో మరో దఫా బీఎల్‌ సంతోష్‌కు నోటీసులు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దీంతో..  ఈ నెల 28వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ సిట్‌ నోటీసులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు