వస్తానంటూనే.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్ రెడ్డి తీరుపై ఈడీ సీరియస్

27 Dec, 2022 17:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ తాండూరు(వికారాబాద్‌ జిల్లా) ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డిపై దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గరం గరంగా ఉంది. విచారణకు గైర్హాజరు అవుతుండడంతో ఆయనపై చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో.. ఈడీ దర్యాప్తు సైతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే నోటీసులు అందుకుని విచారణకు సహకరిస్తా అంటూనే పైలెట్‌ రోహిత్‌రెడ్డి గైర్హాజరు అవుతూ వస్తున్నారు. ఇవాళ సైతం ఆయన గైర్హాజరు కావడంతో ఈడీ సీరియస్‌గా ఉంది.  ఇప్పటికే రెండు రోజులు రోహిత్ రెడ్డి ని విచారించిన ఈడీ, నందకుమార్ నుంచి సేకరించిన సమాచారంతో.. మరోమారు రోహిత్ రెడ్డి నీ విచారించేందుకు సిద్దమైంది. కానీ, ఆయన రాలేదు. ఈడీ విచారణ హాజరుపై రోహిత్‌ రెడ్డి మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఈడీ భావిస్తోంది. మరోవైపు.. 

ఆయన హైకోర్టుకు వెళ్లడంపైనా ఈడీ రగిలిపోతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ విచారణను బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తనను ఈడీ ఇబ్బంది పెడుతోందని పిటిషన్‌లో ఆరోపించారు. ఈడీ ఈసీఐఆర్ కింద కేసు నమోదు చేసిందని, ఈ కేసును కొట్టేయాలని అభ్యర్థించారు. మనీలాండరింగ్ కింద నోటీసులిచ్చి తనను వేధిస్తున్నారని రోహిత్‌రెడ్డి అందులో పేర్కొన్నారు. 

అంతకు ముందు ఈడీ విచారణకు హాజరయ్యే అంశంపై స్పందిస్తూ.. ఈడీ విచారణపై హైకోర్టులో పిటిషన్ వేశానని స్పష్టం చేశారు. తన పిటిషన్ పై హైకోర్టు విచారించనుందని తెలిపారు. ఈడీ విచారణకు వెళ్లాలా వద్దా అనే విషయంపై తన లాయర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు.

మరిన్ని వార్తలు