Telangana Local Body MLC Elections:‘ఆరు’లో 96

11 Dec, 2021 01:33 IST|Sakshi

మండలి స్థానిక కోటా ఎన్నికల్లో భారీ శాతం పోలింగ్‌96.76 శాతం నమోదు

కరీంనగర్‌లో అత్యధికంగా 99.70%

ఎక్స్‌అఫీషియోల హోదాలో ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటు

పోలింగ్‌ సరళి పర్యవేక్షించిన సీఈఓ శశాంక్‌ గోయల్‌

14న కౌంటింగ్‌.. అదేరోజు ఫలితాలు

సాక్షి, హైదరాబాద్‌/ నెట్‌వర్క్‌: శాసనమండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో.. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులుగా ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికలు జరిగిన ఐదు ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ ఎన్నికల్లో తొలిసారిగా పోలింగ్‌లో పాల్గొన్నారు.

మొత్తం ఆరు స్థానాలకు ఎన్నికలు జరగ్గా 26 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్, మెదక్, నల్లగొండ, ఖమ్మంలో ఒక్కో స్థానానికి, కరీంనగర్‌ జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఐదు జిల్లాల పరిధిలోని 5,326 మంది ‘స్థానిక’ఓటర్లతో పాటు 65 మంది ఎక్స్‌అఫీషియో ఓటర్లకు గాను మొత్తం 96.76 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలీసులు అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పలు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి పోలింగ్‌ సరళిని పర్యవేక్షించారు. సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్‌ ముగిసిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులను పోలీసు బందోబస్తుతో స్ట్రాంగ్‌రూంలకు తరలించారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరిపి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. ఆరు చోట్లా తామే విజయం సాధిస్తామని పోలింగ్‌ సరళిని బట్టి టీఆర్‌ఎస్‌ ధీమా వ్యక్తం చేస్తోంది. 

పలుచోట్ల 100% పోలింగ్‌     
ఉదయం 8 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా ఆదిలాబాద్‌ మినహా మిగతా నాలుగు జిల్లాల్లో మందకొడిగా సాగింది. తర్వాత ఇన్నాళ్లూ టీఆర్‌ఎస్‌ శిబిరాల్లో ఉన్న ఓటర్లు తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు బస్సుల్లో చేరుకోవడంతో ఓటింగ్‌ ఊపందుకుంది. ఆదిలాబాద్‌లో నిర్మల్, కరీంనగర్‌లో కోరుట్ల, జగిత్యాల, హుజూరాబాద్, హుస్నాబాద్, మెదక్‌లో జహీరాబాద్, నారాయణఖేడ్, సిద్దిపేట, తూప్రాన్, నల్లగొండ జిల్లా భువనగిరి పోలింగ్‌ కేంద్రాల్లో వంద శాతం పోలింగ్‌ నమోదైంది.  

కరీంనగర్‌లో రెండు స్థానాలూ మావే: గంగుల 
కరీంనగర్‌ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు తామే దక్కించుకోబోతున్నామని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కరీంనగర్‌ జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి రెండు స్థానాలు ఏకగ్రీవం కావాల్సి ఉందని, కొందరు చేసిన ద్రోహం వల్ల ఎన్నిక జరిగిందని తెలిపారు. ఇక ఆదిలాబాద్‌లో స్వల్ప సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మెదక్‌ జిల్లాలో మొత్తం 1,026 ఓటర్లకు గాను 1,018 మంది (99.22 శాతం) ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎక్స్‌ అఫీషియో సభ్యులు కలుపుకొని మొత్తం 1,271 మంది ఓటర్లు ఉండగా.. 1,233 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటింగ్‌కు దూరంగా సీఎం కేసీఆర్‌ 
గజ్వేల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పోలింగ్‌లో పాల్గొనలేదు. మంత్రుల్లో కేటీ రామారావు సిరిసిల్లలో, హరీశ్‌రావు సిద్దిపేట, గంగుల కమలాకర్‌ కరీంనగర్, కొప్పుల ఈశ్వర్‌ జగిత్యాల, ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్, పువ్వాడ అజయ్‌ ఖమ్మం, జగదీశ్‌రెడ్డి సూర్యాపేట పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఓటరుగా నమోదు కాకపోవడంతో పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు ఓటింగ్‌లో పాల్గొనలేదు. గతంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా నమోదు కావడంతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓటు హక్కు పొందలేకపోయారు.

భట్టిని అడ్డుకున్న పోలీసులు 
ఖమ్మం పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసిన జెడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌ చాలాసేపు లోపలే ఉండడంతో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం కార్యకర్తలు కాంగ్రెస్‌ కార్యాలయానికి వెళ్లిపోగా, పోలింగ్‌ కేంద్రం వద్ద ఆందోళన చేశారనే కారణంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పోలింగ్‌ కేంద్రానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు