ఉన్నవి నిలుపుకొని.. కొన్ని కలుపుకొని..

15 Dec, 2021 03:20 IST|Sakshi

స్థానిక ఎమ్మెల్సీ ఫలితాలపై కాంగ్రెస్‌లో హ్యాపీ

పోటీ చేసిన రెండు చోట్లా ఉన్న వాటి కంటే ఎక్కువ ఓట్లు 

కేసీఆర్‌ సొంత జిల్లాలో 8 ఓట్లు అధికంగా సాధించిన పార్టీ అభ్యర్థి 

అమ్ముడుపోతారనే అపవాదుకు చెక్‌ పడిందనే భావన 

కేడర్‌ పటిష్టంగానే ఉందనడానికి సంకేతమంటున్న నేతలు   

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ పార్టీలో సంతృప్తి వ్యక్తమవుతోంది. ఏ ఒక్క స్థానంలోనూ గెలిచే బలం లేకపోయినా రెండు స్థానాల్లో బరిలోకి దిగి ఆ రెండు స్థానాల్లోనూ తమకు ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు సాధించడం గాంధీభవన్‌ వర్గాల్లో సంతోషాన్ని నింపింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్, ఇతర పార్టీల నుంచి తమకు పెద్ద సంఖ్యలో ఓట్లు క్రాస్‌ కావడం, సీఎం కేసీఆర్‌ సొంత జిల్లాలో తమ ఓట్ల కంటే 8 ఓట్లు ఎక్కువ రావడం పార్టీ నేతల్లో, కేడర్‌లో ఇది తప్పనిసరిగా కొత్త జోష్‌ నింపుతుందనే చర్చ టీపీసీసీ వర్గాల్లో జరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించినా ఉపయోగం లేదని, ఇతర పార్టీలకు అమ్ముడుపోతారనే అపవాదుకు ఈ ఎన్నికలు చెక్‌ పెట్టాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు గీత దాటలేదని అర్థమవుతోందని అంటున్నారు. కాంగ్రెస్‌కు ఉన్న కేడర్‌ ఇప్పటికీ పటిష్టంగానే ఉందని, కొందరు నేతలు పార్టీని వీడి వెళ్లినా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌కు ఆదరణ తగ్గలేదని తెలుస్తోందని పేర్కొంటున్నారు.  

పట్టుపట్టి.. పంతం నెగ్గించుకుని 
గెలిచే బలం లేకపోయినా మెదక్‌ జిల్లా నుంచి జగ్గారెడ్డి, ఖమ్మం నుంచి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలు పట్టుపట్టి మరీ ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపారు. మెదక్‌ నుంచి జగ్గారెడ్డి తన సతీమణి నిర్మలను నిలబెట్టగా, ఖమ్మం నుంచి స్థానిక పారిశ్రామికవేత్త రాయల నాగేశ్వరరావు పోటీ చేశారు. అయితే దీనిపై టీపీసీసీ నేతల్లో కొంత ఆందోళన వ్యక్తమయింది. ఇప్పటికే హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో చావు దెబ్బతిన్న పరిస్థితుల్లో గెలిచే బలం లేదని స్పష్టంగా తెలిసినా పోటీ చేసి ఉన్న ఓట్లు పోగొట్టుకుంటే పరిస్థితి మరింత దిగజారుతుందనే చర్చ పార్టీలో జరిగింది. కానీ మెదక్, ఖమ్మం నేతలు చేసిన ధైర్యంతో ఇప్పుడు కాంగ్రెస్‌ కేడర్‌కు కొత్త ఊపు వచ్చిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. 

మెదక్‌లోనూ ఎక్కువ ఓట్లు  
ఉమ్మడి మెదక్‌ విషయానికి వస్తే.. పార్టీకి ఉన్న ఓట్లను కాపాడుకునేందుకు అయినా తన భార్యను బరిలోకి దింపుతానని రంగంలోకి దిగిన జగ్గారెడ్డి పార్టీ ఓట్ల కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా తన పార్టీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ చేశారు. దానికి తగినట్లుగానే 8 ఓట్లు ఎక్కువే సాధించడం ద్వారా జిల్లా కాంగ్రెస్‌ పార్టీని సేఫ్‌ జోన్‌లోకి నెట్టారు. ఈ రెండు స్థానాలకు తోడు నల్లగొండలో స్వతంత్రుడిగా పోటీ చేసిన కాంగ్రెస్‌ జడ్పీటీసీ, మాజీ ఎమ్మెల్యే నగేశ్‌కు కూడా 200 కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. వాస్తవానికి, అక్కడ 380 పైచిలుకు ఓట్లు కాంగ్రెస్‌కు ఉన్నా కొందరు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడంతో ఆ సంఖ్య 230 వరకు వచ్చింది. అయితే నగేశ్‌కు పార్టీ బీఫారం ఇవ్వలేదు. అయినా దాదాపు అన్ని ఓట్లు ఆయన బాక్సులో పడడం గమనార్హం.   

ఖమ్మంలో 150 ఓట్లు క్రాస్‌ 
ఖమ్మంలో వాస్తవానికి కాంగ్రెస్‌ బలం 116 మాత్రమే. అందులోనూ 25–30 మంది గెలిచిన తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. అంటే ఆ పార్టీకి ఉన్న బలం ఎంత కాదన్నా 100లోపే. కానీ బ్యాలెట్‌ బాక్సులు తెరచి చూస్తే కాంగ్రెస్‌ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 242 . అంటే కనీసం 150 ఓట్లు టీఆర్‌ఎస్‌తో పాటు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌కు క్రాస్‌ అయ్యాయన్నమాట. ఇందుకు రెండు కారణాలున్నాయని అంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లినా కేడర్‌ ఉందని, అలాగే వారితో పాటు వెళ్లి టీఆర్‌ఎస్‌ గుర్తుపై పోటీ చేసి గెలిచినా స్థానిక ప్రతినిధుల మనుసుల్లో కాంగ్రెస్‌ పార్టీనే ఉందని అర్థమవుతోందని టీపీసీసీ సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు. దీనికి తోడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూడా ఈ ఎన్నికల్లో వ్యక్తమైందని ఆయన చెప్పారు.  

>
మరిన్ని వార్తలు